Strait of Hormuz: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ జలసంధి మార్గంలో వెళ్తున్న సింగపూర్ రిజిస్ట్రేషన్ కలిగిన రెండు భారీ కంటైనర్ నౌకలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దాడులు జరిగాయి.
ఈ అనూహ్య ఘటన పశ్చిమాసియాలో సంచలనం సృష్టించింది.

దగ్ధమైన 'జీఎఫ్ఎస్ ప్రైడ్' నౌక & సిబ్బంది రెస్క్యూ
ఈ దాడుల్లో 'జీఎఫ్ఎస్ ప్రైడ్' అనే కంటైనర్ నౌక పూర్తిగా అగ్నిప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయింది. అయితే, సకాలంలో స్పందించడంతో అందులోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) బుధవారం ధ్రువీకరించింది. ఇక స్వల్పంగా దెబ్బతిన్న మరో నౌక 'జీఎఫ్ఎస్ గిసెల్' మాత్రం తనంతట తానుగా సురక్షిత ప్రాంతానికి చేరుకోగా, దానిలోని 22 మంది సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ రెండు నౌకల్లోనూ సింగపూర్ పౌరులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.
Strait of Hormuz: ఇరాన్ భిన్నమైన కథనం & ఐఆర్జీసీ హెచ్చరికలు
ఈ ఘటనపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ పూర్తి విరుద్ధమైన వాదనను వినిపిస్తోంది. తమ జలాల్లోకి అనధికారికంగా, ప్రమాదకర మార్గంలో ప్రవేశించిన ఒక నౌక సముద్రంలో ఉన్న నేవల్ మైన్‌ను ఢీకొనడం వల్లే పేలుడు సంభవించిందని పేర్కొంది. దాదాపు 2,500లకు పైగా కంటైనర్లతో వెళ్తున్న ఆ నౌక మంటల్లో చిక్కుకుని మునిగిపోయిందని వెల్లడించింది. సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్ల వల్ల ఇతర నౌకలకు ముప్పు పొంచి ఉందని, సమీపంలోని పడవలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐఆర్జీసీ కమాండర్
హర్మూజ్ జలసంధిని తమ దేశ నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీ అజ్మాయీ స్పష్టం చేశారు. అమెరికా ప్రేరేపణతో ఎవరైనా సముద్ర చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, కఠిన చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

