Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఆ కార్యక్రమంలో ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను భారత్ సమర్థించబోదని తేల్చిచెప్పింది.

భారత్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ అంశంపై మాట్లాడారు. బుధవారం జరిగిన సదరు వర్చువల్ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని, ఇందులో భారత ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. “బంగ్లాదేశ్‌లో చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మేము ఏ కోశానా సమర్థించం” అని జైస్వాల్ కుండబద్దలు కొట్టారు.
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలు మరియు బంగ్లాదేశ్ స్పందన
బుధవారం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ఆడియో లింక్ ద్వారా నిర్వహించిన సమావేశంలో షేక్ హసీనా ప్రసంగించారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, ప్రజలు భయం, అభద్రత, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రిగ్గింగ్ ద్వారానే అధికారంలోకి వచ్చిందని విమర్శించిన ఆమె, ఈ ఏడాది చివరి నాటికి తాను మళ్లీ స్వదేశానికి తిరిగి వెళతానని వెల్లడించారు.
జాతీయ భద్రతకు ప్రాధాన్యం
హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. పొరుగు దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని, తమ జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు.
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N160S, N160SS లాంచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

