Save AP : ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న వరుస దారుణాలను ప్రస్తావిస్తూ “హే రామ్.. సేవ్ ఏపీ” (Hey Ram.. Save AP) అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (X) లో పెద్ద ఎత్తున నినదించారు. తునిలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టడంలో కూటమి ప్రభుత్వం మరియు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే పెద్దాపురంలో మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి ఘటన మరియు కావలిలో తెలుగుదేశం పార్టీ నేత ఒక మహిళను వివస్త్రను చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

లాకప్ డెత్స్, సోషల్ మీడియా అరెస్టులపై ఫైర్.. న్యాయం కోసం డిమాండ్
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొడుకును కోల్పోయిన ఓ తల్లి అడుగుతున్న న్యాయమైన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం సాగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టు కేవీఆర్ (KVR) తో పాటు యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అన్యాయంగా అక్రమ కేసులతో అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, తప్పులను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకాలకు స్వస్తి పలికి ప్రజల ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపదని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.

