Rain Alert: బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్థిరంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (IAS) తెలిపారు.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
Read Also:AP Weather Update: ఏపీలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ – ఆ నాలుగు జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు!

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
- భారీ నుండి అతిభారీ వర్షాలు: ఆదివారం, సోమవారం రోజుల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో రికార్డు స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ నాలుగు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ (Orange Alert) జారీ చేసింది.
- భీకర ఈదురుగాలులు: వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Rain Alert: ఏపీలో వాతావరణం – గంటకు 50 కిమీ వేగంతో గాలులు:
ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావం వల్ల ఇప్పటికే పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై, మోస్తరు జల్లులు పడుతున్నాయి.
- భారీ వర్షాల ప్రాంతాలు: ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
- జాగ్రత్తలు తప్పనిసరి: కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు మరియు ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా భారీ ప్రకటనల హోర్డింగ్‌ల (Hoardings) దగ్గర నిలబడవద్దని హెచ్చరించారు.
Epaper: epaper.vaartha.com

