VenkyAnil5 : విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం '#VenkyAnil5' (NKRAR2) వర్కింగ్ స్పీడ్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.
రాయలసీమ నేపథ్యంతో సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పక్కా లక్ష్యంతో చిత్ర యూనిట్ ఏమాత్రం విరామం లేకుండా శరవేగంగా షెడ్యూళ్లను పూర్తి చేస్తోంది. సెట్స్ మీదకు వెళ్లిన అతి తక్కువ సమయంలోనే, అనుకున్న సమయం కంటే వేగంగా పనులు పూర్తి చేస్తూ అనిల్ రావిపూడి తన రాకెట్ స్పీడ్ మేకింగ్‌ను మరోసారి నిరూపించుకుంటున్నారు.

అప్పుడే ఫస్టాఫ్ పూర్తి.. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, అప్పుడే ప్రథమార్థం (First Half) షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ వెల్లడించడంతో సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి వర్కింగ్ స్పీడ్ చూసి “ఇదేం స్పీడ్ అనిల్!” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. షూటింగ్‌తో పాటు వినూత్న రీతిలో చేపడుతున్న ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. వినోదం, యాక్షన్, బలమైన కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మల్టీస్టారర్ సంక్రాంతి రేసులో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

