Former Minister Laxma Reddy: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడం ముమ్మాటికి అన్నదాతల పోరాట విజయమని మాజీ మంత్రి డాక్టర్ సి.
లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిది రోజులుగా అన్నదాతలు, విపక్షాలు చేసిన నిరంతర ఆందోళనలు, ధర్నాలకు తలొగ్గి ప్రభుత్వం దిగొచ్చి కాలువ గేట్లు ఎత్తాల్సి వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ సర్కారు రైతులను అనవసర గందరగోళానికి గురిచేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.
వానాకాలం ముగిసేవరకు నిరంతరాయంగా నీరందించాలి
ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా నీటి విడుదలను నిలిపివేయడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయేమోనన్న భయంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత, బాధ్యతారహిత నిర్ణయాల వల్లే ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నీటిని విడుదల చేయడం మంచి పరిణామమని, కేవలం తాత్కాలికంగా కాకుండా ప్రస్తుత వానాకాలం సీజన్ పంటలు పూర్తయ్యే వరకు ఆయకట్టుకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Former Minister Laxma Reddy: రైతుల పక్షాన నిలిచింది బీఆర్‌ఎస్ పార్టీయే
రాజకీయాలకు అతీతంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతాంగానికి కొండంత అండగా నిలబడుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. అందుకే తాము రైతులకు మద్దతుగా ధర్నాకు పిలుపునిచ్చామని, ఈ ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. గతంలో కృష్ణా నదిలో వరద ప్రారంభమైనప్పుడు కూడా బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాల ఫలితంగానే రైతులకు సకాలంలో సాగునీరు అందిందని ఆయన గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలను కాలరాసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, చివరి ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు


