Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇకపై డిజిటల్ టికెట్ల స్క్రీన్‌షాట్లు చెల్లవు.. స్పష్టం చేసిన రైల్వే శాఖ!

ఇకపై డిజిటల్ టికెట్ల స్క్రీన్‌షాట్లు చెల్లవు.. స్పష్టం చేసిన రైల్వే శాఖ!

వార్త 0 months ago

Indian Railways: భారతీయ రైల్వే శాఖ డిజిటల్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల (Digital Unreserved Tickets) విషయంలో ప్రయాణికులకు అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది.

రైలు ప్రయాణాల్లో ఇకపై టికెట్ స్క్రీన్‌షాట్లు లేదా ఫార్వార్డ్ చేసిన కాపీలు చూపిస్తే అంగీకరించబోమని, సదరు ప్రయాణికుడికి జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది.

రైల్వే అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘రైల్ వన్’ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసుకున్న డిజిటల్ జనరల్ లేదా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా బుకింగ్ చేసిన మొబైల్ ఫోన్‌లోని అధికారిక యాప్ ఓపెన్ చేసి మాత్రమే చూపించాల్సి ఉంటుంది. టికెట్ యొక్క స్క్రీన్‌షాట్లు (Screenshots), పీడీఎఫ్ (PDF) కాపీలు లేదా వాట్సాప్ (WhatsApp) వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఫార్వార్డ్ చేసిన కాపీలను ప్రయాణానికి సరైన ఆధారాలుగా పరిగణించబోరు. ప్రయాణికులు రైలు బయలుదేరక ముందే టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు, ప్రయాణ సమయంలో టికెట్ బుక్ చేసిన ఫోన్ , అసలు గుర్తింపు కార్డును (Original ID Card) వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

Read Also : Puri Rath Yatra: పూరి రథయాత్రలో డ్రోన్లకు నో ఎంట్రీ

 Screenshots of digital tickets will no longer be valid - Railways clarifies!

Indian Railways: నిబంధన ఎందుకు తెచ్చారు?

ఒకే డిజిటల్ టికెట్‌ను స్క్రీన్‌షాట్లు తీసి ఎక్కువ మందికి వాట్సాప్‌లలో పంపడం ద్వారా జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జూలై 8న తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఓ ప్రయాణికుడు టీటీఈకి వాట్సాప్ స్క్రీన్‌షాట్ చూపించగా, అధికారులు అతడికి భారీ జరిమానా విధించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

నెటిజన్లు, ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు

రైల్వే శాఖ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులందరికీ ఒకరే టికెట్లు బుక్ చేసే సందర్భాల్లోనూ, లేదా స్మార్ట్‌ఫోన్ వాడటం, సాంకేతిక పరిజ్ఞానం లేని వృద్ధులు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే సాధకబాధల గురించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ టికెట్ బుక్ చేసిన వ్యక్తి అత్యవసరంగా ప్రయాణం రద్దు చేసుకుని, మిగిలిన వారు ప్రయాణించాల్సి వస్తే ఆ టికెట్ చూపించడానికి ఫోన్ ఉండదు కాబట్టి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రైల్ వన్’ యాప్‌లో డిజిటల్ పద్ధతిలో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం రాయితీ లభిస్తున్నప్పటికీ, తాజాగా కఠినతరం చేసిన ఈ నిబంధన అనేకమంది సాధారణ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న ఈ ఆందోళనలపై రైల్వే శాఖ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha