FSSAI : దేశంలో విక్రయిస్తున్న అధిక కెఫిన్ పానీయాలపై కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్ బుల్, మాన్‌స్టర్, పెప్సీకి చెందిన స్టింగ్‌తో పాటు ఇతర కంపెనీలు తమ ఉత్పత్తులపై ఎనర్జీ డ్రింక్ లేదా దానికి సమానమైన పదాలను ఉపయోగించకూడదని ఆదేశించింది.
ఈ మార్పులు అమలు చేసేందుకు కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం.
వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం :
FSSAI అభిప్రాయం ప్రకారం, ఈ పానీయాలను ఎనర్జీ డ్రింక్ గా ప్రచారం చేయడం వల్ల వాటిని తాగితే వెంటనే శక్తి లభిస్తుందనే భావన ప్రజల్లో కలుగుతోంది. ఇలాంటి ప్రచార వాదనలు వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం భారత ఆహార ప్రమాణాల్లో ఈ తరహా ఉత్పత్తులకు ప్రత్యేకంగా ఎనర్జీ డ్రింక్ అనే వర్గీకరణ లేదని కూడా స్పష్టం చేసింది.

ఈ పానీయాల్లో కెఫిన్, చక్కెర (షుగర్), టౌరిన్ వంటి పదార్థాలు అధిక మోతాదులో ఉండే అవకాశం ఉందని, వీటిని తరచుగా లేదా అధికంగా తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యుక్తవయస్కులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇలాంటి పానీయాలను పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
FSSAI నిర్ణయంపై పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, నిబంధనలను పాటించాల్సిందేనని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. అవసరమైతే న్యాయపరంగా సవాలు చేసుకునే అవకాశం కంపెనీలకు ఉన్నప్పటికీ, లేబుళ్ల మార్పు విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించడం, తప్పుదారి పట్టించే ప్రచారాన్ని అరికట్టడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

