Telangana Waqf Board: ఇమామ్‌లు, మౌజన్‌ల కుటుంబాలకు 99 గజాల చొప్పున నివేశన స్థలాలు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీవ్రంగా ఖండించింది.
ఇదంతా ముమ్మాటికీ నకిలీ ప్రచారమని, ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన ‘సూఫీ ఉలేమా కౌన్సిల్’ అనే సంస్థ పేరిట ఉర్దూలో ముద్రించిన ఒక కరపత్రం ప్రస్తుతం వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇమామ్‌లు, మౌజన్‌ల భార్యలు, సోదరీమణులు లేదా తల్లుల పేరుతో 99 గజాల స్థలాన్ని కేటాయిస్తామని అందులో రాసి ఉంది. ఈ పథకం కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి కీలక పత్రాలతో కిషన్‌బాగ్‌లోని ఓ నిర్దిష్ట చిరునామాలో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు జూలై 15 ఆఖరి తేదీ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు.
‘సూఫీ ఉలేమా కౌన్సిల్’తో ప్రభుత్వానికి సంబంధం లేదు!
వైరల్ అవుతున్న ఈ నోటీసుతో తెలంగాణ ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు కానీ ఎలాంటి సంబంధం లేదని అధికారులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ కరపత్రంలో ఉన్న ‘సూఫీ ఉలేమా కౌన్సిల్’ అనే సంస్థతో తమకు ఎలాంటి అనుబంధం లేదని బోర్డు పౌర సంబంధాల అధికారి (PRO) వెల్లడించారు.
అమాయక ప్రజలను బురిడీ కొట్టించి, వారి నుంచి వ్యక్తిగత గుర్తింపు పత్రాలు, ఇతర వివరాలను సేకరించి మోసాలకు పాల్పడేందుకే కేటుగాళ్లు ఈ తరహా నకిలీ నోటీసును సృష్టించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమామ్‌లు, మౌజన్‌లు, వక్ఫ్ సంస్థల ప్రతినిధులతో పాటు ముస్లిం మైనారిటీలు ఎవరూ ఈ ప్రకటనను నమ్మి తమ విలువైన పత్రాలను ఎవరికీ సమర్పించవద్దని బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నకిలీ ప్రచారానికి ఒడిగట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వక్ఫ్ బోర్డు సిద్ధమవుతోంది.
ఘట్‌కేసర్ దంపతుల ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు.. రూ. 20 లక్షల మోసం!

