Indiramma Towers: హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా నగరంలోని నాలుగు ప్రధాన నియోజకవర్గాల్లో ఫ్లాట్ల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
రాబోయే నవంబర్ 3వ తేదీన ముషీరాబాద్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట మరియు గోషామహల్ నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారులను పూర్తిగా ఆన్లైన్ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు వెల్లడించారు.

రద్దయిన కేటాయింపులపై నవంబరు 4న మరోసారి లాటరీ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హౌసింగ్ పథకానికి సంబంధించి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 నియోజకవర్గాల్లో వివిధ కారణాల వల్ల రద్దయిన లేదా పెండింగ్లో ఉన్న ఫ్లాట్ల కేటాయింపుల కోసం నవంబరు 4న మరోసారి ప్రత్యేకంగా లాటరీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు పారదర్శకమైన రీతిలో ఇళ్లను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

