Ponguleti Srinivas Reddy: హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 'ఇందిరమ్మ టవర్స్' పథకంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అపోహలకు తావు లేకుండా పారదర్శక సమాచారం అందించడమే ఈ హెల్ప్‌లైన్ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

Read also: Ponnam Prabhakar: విద్యార్థుల ఐక్యత, రాహుల్ గాంధీ పోరాటం ఫలించింది: పొన్నం ప్రభాకర్
దళారులను నమ్మవద్దు – ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్
ప్రజలు ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. నేరుగా ప్రభుత్వ అధికారిక సమాచారం కోసం 040-24603572 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కాల్ సెంటర్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో సేవలు అందిస్తుందని వెల్లడించారు.
Ponguleti Srinivas Reddy: ఆధార్ ఒక్కటే ప్రాతిపదిక – ఈఎండీ చెల్లింపు విధానం
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేవలం ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుందని మంత్రి తెలిపారు. దరఖాస్తు సమయంలో కుల లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అటాచ్ చేయాల్సిన అవసరం లేదని, వాటిని లాటరీ సమయంలో సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఇక దరఖాస్తు ధ్రువీకరణ కోసం రూ.10,000 ఈఎండీ (EMD) మొత్తాన్ని కేవలం యూపీఐ (UPI) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలని, లాటరీ దక్కని వారికి ఆ మొత్తం తిరిగి వారి ఖాతాలోనే జమ అవుతుందని భరోసా కల్పించారు.
అర్హతలు మరియు ఫ్లాట్ల వివరాలు
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో గత పదేళ్లుగా నివాసం ఉంటున్న వారు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారు ఈ ఇందిరమ్మ టవర్స్ పథకానికి అర్హులని మంత్రి వివరించారు. దరఖాస్తుదారులకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ ఓఆర్ఆర్ లేదా జీహెచ్ఎంసీ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదనే నిబంధన పెట్టారు. సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 నుంచి రూ.60 లక్షల మార్కెట్ విలువ చేసే 1బీహెచ్‌కే ఫ్లాట్‌ను ప్రభుత్వం కేవలం రూ.6 లక్షల లబ్ధిదారుల వాటాతో అందిస్తోంది. దీనికి తోడు రూ.5 లక్షల సబ్సిడీని ఇస్తూ, 20 నుంచి 25 గజాల అవిభాజ్య వాటా (UDS) స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
మొదటి విడతలో 7,680 ఇళ్ల నిర్మాణం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలను సాకారం చేసేలా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పొంగులేటి వెల్లడించారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులు ఎక్కువగా ఉంటే పూర్తిగా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

