Indian Embassy : పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలకమైన ప్రయాణ మార్గదర్శకాలను (Advisory) జారీ చేసింది.
అత్యవసరమైతే తప్ప ఇరాన్ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్‌లో నివసిస్తున్న లేదా ప్రయాణాల్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సర్వీసులను ఉపయోగించుకుని వెంటనే తాత్కాలికంగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇరాన్‌లోనే కొనసాగే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మరియు తమ వివరాలను రాయబార కార్యాలయంలో వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.
Read Also: Lucknow crime: లక్నోలో4 ఏళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యం
Indian Embassy
Indian Embassy :అమెరికా – ఇరాన్ ముదిరిన సైనిక ఘర్షణలు
ఇరాన్‌లోని అణు మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులు జరపడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ తీరప్రాంత నిఘా వ్యవస్థలు, వాయు రక్షణ కేంద్రాలు, క్షిపణి మరియు డ్రోన్ నిల్వ కేంద్రాలపై భారీ దాడులు నిర్వహించింది. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న ‘డార్ఖోవిన్’ అణు విద్యుత్ కేంద్రంపై తెల్లవారుజామున అమెరికా వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ అణుశక్తి సంస్థ ఆరోపించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అత్యవసర దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేంద్రం నిర్మాణ దశలోనే ఉండటంతో అక్కడ అణు పదార్థాలు లేవని, రేడియోలాజికల్ ప్రమాదం ఏమీ లేదని ఐఏఈఏ స్పష్టం చేసింది. అయితే అణు కేంద్రాల సమీపంలో ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రోస్సీ విజ్ఞప్తి చేశారు.
డ్రోన్ కూల్చివేత, ద్వీపాలపై దాడులు
మరోవైపు అహ్వాజ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అధునాతన ఎంక్యూ-9 (MQ-9) డ్రోన్‌ను తమ బలగాలు విజయవంతంగా కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అలాగే ఖేష్మ్ ద్వీపంపైనా అమెరికా దాడులు జరిపినట్లు, అక్కడ భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాలతో ఇరాన్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఏ క్షణంలోనైనా రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను మరియు ఈ-మెయిల్‌ను అందుబాటులో ఉంచారు.
- మొబైల్ నంబర్లు: +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359
- ఈ-మెయిల్: cons.tehran@mea.gov.in పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు భారతీయులు పుకార్లను నమ్మకుండా, అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తాజా సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com

