Chanti Kranti Kiran: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలోనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి 48 మంది అర్హులైన పేద లబ్ధిదారులను ఎంపిక చేశారని గుర్తుచేశారు. ఇళ్లకు బ్లాక్‌లు, డోర్ నంబర్లు కేటాయించి, పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు.
ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం - నేడు నిరుపయోగం
ఇళ్లకు సిసి రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించి పంపిణీ చేసే లోపే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంపిణీ ఆలస్యమైందని క్రాంతి కిరణ్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా, చిన్నపాటి మరమ్మతులు చేసి పేదలకు ఇళ్లను అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఇళ్లు పాడైపోతుండటంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Chanti Kranti Kiran: లబ్ధిదారుల జాబితా మార్పుపై ఆగ్రహం
ఓటు బ్యాంకు రాజకీయం కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి, గతంలో అధికారులు రూపొందించిన అసలైన అర్హుల జాబితాను పక్కనబెట్టారని ఆరోపించారు. తమ అనుకూల వర్గాలకు ఇళ్లను కట్టబెట్టేందుకు నూతన జాబితాను సిద్ధం చేయడం దురదృష్టకరమన్నారు. నిజమైన పేదలను పక్కనపెట్టి ఆస్తులు, సొంత ఇళ్లు ఉన్నవారికి కేటాయించేందుకు కుట్ర పడుతున్నారని మండిపడ్డారు. అర్హులైన పేదలకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దమెత్తున పోరాటాలు చేస్తామని ప్రభుత్వం మరియు అధికారులను ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆందోల్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, పుల్కల్ గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, మాజీ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com

