E20 Petrol Price: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ఇటీవలి కాలంలో తలెత్తిన పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఢిల్లీలో పెట్రోల్ ధర అదనంగా పెరగకుండా నివారించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఒకవేళ ఇథనాల్ మిశ్రమం లేకపోయి ఉంటే, గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.125 వరకు చేరి ఉండేదని స్పష్టం చేసింది.

వినియోగదారులపై భారం తగ్గించిన ఇథనాల్ బ్లెండింగ్
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, ఈ విధానం వల్ల సామాన్య వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారం పడకుండా నివారించబడింది. పెట్రోలియం శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.30 వరకు ఆదా కావడం జరిగిందని, ప్రస్తుత విధానంతో ఢిల్లీలో లీటర్ ధర రూ.94.77కే పరిమితమైందని పేర్కొంది.
దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా
దేశీయంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసి పెట్రోల్‌లో కలపడం వల్ల విదేశీ క్రూడాయిల్ దిగుమతులపై మన దేశం ఆధారపడే శాతం గణనీయంగా తగ్గుతోంది. ఇప్పటివరకు అమలు చేసిన ఈ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని కేంద్రం తెలిపింది. అలాగే పర్యావరణానికి మేలు చేస్తూ 950 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని, రైతులు మరియు డిస్టిలరీలకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు అందాయని వివరించింది.
ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు లేదు
ఇథనాల్ తయారీ కోసం ఆహార భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం మిగులు ధాన్యాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) మరియు ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించిన ధాన్యాన్ని ఎక్కడా మళ్లించడం లేదని, కేవలం మానవ వినియోగానికి పనికిరాని, విరిగిన బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com

