Minister Kondapalli Srinivas: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒడిశా సముద్ర తీరంలో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన 10 మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడం పట్ల రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP), మరియు ప్రవాసాంధ్రుల సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు మంత్రి కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో.. బోటు యజమాని దానయ్యతో పాటు ప్రాణాలతో బయటపడిన వేటగాళ్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు. విపత్కర సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులు చూపిన సత్వర సమన్వయం, ఒడిశా మెరైన్ పోలీసుల సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్ ఎంతో అభినందనీయమని మంత్రి కొనియాడారు.
బాలాసోర్ వద్ద తీరం దాటనున్న వాయుగుండం - ఉత్తరాంధ్రకు అలర్ట్
ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ కూడా రాబోయే రెండు రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన నివేదిక ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు 50 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
Minister Kondapalli Srinivas: తీరానికి చేరాలి - యంత్రాంగానికి మంత్రి కొండపల్లి ఆదేశాలు
సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కాబట్టి వేటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వెళ్లరాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పటికే పొరపాటున వేటకు వెళ్లిన వారు సైతం విధిగా లైఫ్ జాకెట్లు ధరించి, తక్షణమే సమీప తీర ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అత్యవసర పనులు ఉంటే తప్ప సామాన్య ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ, మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, సిబ్బంది కంట్రోల్ రూమ్‌లలో ఉంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా, వరద నష్టాలనైనా ఎదుర్కొనేందుకు వీలైనంత వేగంగా జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

