Pandavani Folk Singer Death: భారతీయ జానపద కళా ప్రపంచంలో తీరని లోటు ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్ సాంప్రదాయ పండవానీ (Pandavani) జానపద కళను అంతర్జాతీయ వేదికలపై మారుమోగించిన లెజెండరీ కళాకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ తీజన్ బాయి (70) ఆదివారం (జూలై 5) తెల్లవారుజామున కన్నుమూశారు.
గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, వయోభారంతో కూడిన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో దేశీయ జానపద సంస్కృతిలో ఒక అద్భుత అధ్యాయం ముగిసినట్లయింది.
Read Also:Vijay Deverakonda: హరీశన్న 'సిద్దిపేట కా షేర్'.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
మహాభారత గాథలకు ప్రాణం పోసిన అభినయం!

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా గనియారి గ్రామంలో జన్మించిన తీజన్ బాయి, చిన్నతనం నుంచే జానపద కళల వైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మహాభారత గాథలను తనదైన ప్రత్యేక శైలిలో గాత్రం, వేగవంతమైన హావభావాలు, నృత్య అభినయంతో ఆవిష్కరించి అంతర్జాతీయంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మహిళలు కూర్చుని పాడే ‘వేదమతి’ శైలిని పక్కనబెట్టి, అప్పటివరకు పురుషులకే పరిమితమైన నిలబడి హుషారుగా పాడే ‘కాపాలిక’ శైలిని ఎంచుకుని 13 ఏళ్ల వయసులోనే రంగప్రవేశం చేశారు. తన చేతిలోని తంబురాను ఒకసారి అర్జునుడి విల్లుగా, మరోసారి భీముడి గదగా మారుస్తూ ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధులను చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. భారతీయ జానపద సంప్రదాయాలను, సంస్కృతిని రక్షించడంలో తీజన్ బాయి చేసిన అమూల్యమైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది.
Pandavani Folk Singer Death:ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం
తీజన్ బాయి హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. “భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా పండవానీ జానపద శైలిని ప్రపంచవ్యాప్తంగా అజరామరం చేసిన గొప్ప కళాకారిణి తీజన్ బాయి. ఆమె చేసిన సేవలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ గుర్తిండిపోతాయి. దేశీయ సంగీత ప్రపంచానికి ఇది తీరని లోటు” అని కొనియాడారు. ఆమె మరణవార్త తెలుసుకున్న దేశవ్యాప్త సాంస్కృతిక ప్రముఖులు, కళాకారులు రాయ్‌పూర్‌లోని ఆమె నివాసానికి, ఆసుపత్రికి చేరుకుని అశ్రునయనాలతో ఘన నివాళులు అర్పిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

