Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జననాయగన్' నిర్మాతకు కీలక పదవి.. సీఎం విజయ్ నిర్ణయంపై విమర్శలు

'జననాయగన్' నిర్మాతకు కీలక పదవి.. సీఎం విజయ్ నిర్ణయంపై విమర్శలు

వార్త 1 month ago

Jananayagan Movie Producer: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఒక తాజా నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైంది.

సీఎం విజయ్ కథానాయకుడిగా నటించిన 'జననాయగన్' సినిమా నిర్మాత కె. వెంకట నారాయణకు ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయన్ను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపిస్తున్నాయి.

ఏడాది పాటు పదవిలో కొనసాగింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ నియామకానికి సంబంధించిన ఇతర షరతులు, నిబంధనలను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జననాయగన్' సినిమాను వెంకట నారాయణ నిర్మించారు.

ముఖ్యమంత్రి విజయ్‌తో ఈ నిర్మాతకు ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాల వల్లే ఈ పదవి దక్కిందనే ఆరోపణలు వస్తున్నాయి. గత మే నెలలో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ను కలిసిన అధికారిక ప్రతినిధి బృందంలో కూడా వెంకట నారాయణ ఉండటం గమనార్హం. మరోవైపు, 'జననాయగన్' చిత్రం సెన్సార్ (సిబిఎఫ్‌సి) అనుమతులు ఆలస్యం కావడం, విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం వంటి సమస్యలతో ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో ఉంది.

ఢిల్లీలో రాష్ట్రం నవ్వులపాలవుతుంది: డీఎంకే ఫైర్

ఈ నియామకంపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (DMK) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ పి. విల్సన్ మాట్లాడుతూ.. ఒక సినిమా నిర్మాతను ఇంతటి కీలకమైన పరిపాలనా పదవిలో కూర్చోబెట్టడం ఆ పదవికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించడమేనని విమర్శించారు.

“కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రత్యేక ప్రతినిధి ఒక వారధిలా పనిచేస్తారు. కేంద్ర మంత్రులతో సమన్వయం చేయడం, ఢిల్లీలో సీఎం సమావేశాలను షెడ్యూల్ చేయడం, కేంద్ర పాలసీలపై నివేదికలు ఇవ్వడం, పార్లమెంట్ సమయంలో ఎంపీలకు అధికారిక సమాచారం అందించడం వంటి ఎంతో బాధ్యతాయుతమైన పనులు ఈ పదవి పరిధిలోకి వస్తాయి. కేవలం నచ్చిన వ్యక్తి అని ఒక సినిమా నిర్మాతను నియమిస్తే జాతీయ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రాష్ట్రం నవ్వులపాలు అవుతుంది” అని విల్సన్ మండిపడ్డారు. ఈ నియామకంపై డీఎంకే విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

అగ్నివీర్ మురళీ నాయక్ కు కేంద్రం అరుదైన గౌరవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha