Janasena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార జనసేన పార్టీలోకి మరో భారీ చేరికల పర్వానికి తెరలేవబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.
జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన రాజకీయ పట్టును నిరూపించుకోవడంతో పాటు పార్టీ అధిష్టానం వద్ద తన పరపతిని మరింత పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులను జనసేన వైపు తిప్పే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మానుగుంట మహీధర్ రెడ్డి, శిద్ధా రాఘవరావులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, ఆమంచి కృష్ణమోహన్‌లను జనసేనలోకి తీసుకువచ్చేందుకు బాలినేని తెరవెనుక విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Janasena Partyసీట్ల హామీ, గుర్తింపుపై స్పష్టత రాగానే పవన్ సమక్షంలో కండువాలు!
ఈ నలుగురు కీలక నేతలు ఇప్పటికే బాలినేని రాయబారంతో జనసేన గూటికి చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల టాక్. అయితే, భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో తమకు లభించే సీట్ల కేటాయింపుపై పక్కా హామీతో పాటు, పార్టీలో తమ సీనియారిటీకి తగ్గ తగిన గుర్తింపు, ప్రాధాన్యతలపై వీరు పూర్తి స్పష్టతను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమీకరణలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కలిసి అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు భోగట్టా. ఈ భారీ చేరికలు గనుక ఊహించినట్లు జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జనసేన తిరుగులేని శక్తీగా మారడమే కాకుండా, విపక్షాలకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

