Rahul Letter : ఝార్ఖండ్‌లో పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలపై ఆందోళనలు చేస్తున్న విద్యార్థులతో వెంటనే మాట్లాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశారు.
విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి, వారి డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం కొంతమంది విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరపడం, కొన్ని డిమాండ్లను అంగీకరించడం మంచి పరిణామమే అయినప్పటికీ, సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని ఆయన గుర్తుచేశారు.

నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థులతో చర్చించండి: సీఎమ్‌కు కాంగ్రెస్ అగ్రనేత విజ్ఞప్తి
పరీక్షల అక్రమాలపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ పలువురు విద్యార్థులు ఇప్పటికీ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారని రాహుల్ గాంధీ తన లేఖలో ప్రస్తావించారు. ఆందోళన బాట పట్టిన విద్యార్థుల వద్దకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి, వారితో ముఖాముఖి సమావేశమై సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్లో ప్రభుత్వం మరింత సానుకూలంగా స్పందించి, పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆయన ఆ లేఖలో ఆకాంక్షించారు.

