Nellore DRC Meeting 2026: నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ (ZP) కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నాడు నిర్వహించిన నెల్లూరు జిల్లా సమీక్షా కమిటీ (DRC) సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో, ఫలప్రదమైన చర్చలతో ముగిసింది.
జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యవేక్షణలో ఈ కీలక సమావేశం జరిగింది.
ఈ ఉన్నత స్థాయి భేటీలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలతో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు (MP) బీదా మస్తాన్ రావు, జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ మరియు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం ప్రజాప్రతినిధులతో ప్రత్యేక భేటీ అనంతరం ప్రారంభమైన ఈ సమావేశంలో జిల్లాలోని సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
Read Also : బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్
ఖరీఫ్ సీజన్, పంటల మద్దతు ధరలపై ప్రత్యేక దృష్టి: ఇన్‌ఛార్జ్ మంత్రి ఫరూక్
జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయం, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య శాఖలపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. జిల్లాలో భారీగా పొగాకు పండిస్తున్నప్పటికీ రైతులకు పొగాకు బోర్డులో సరైన గుర్తింపు లేకపోవడంపై సమావేశంలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించామని తెలిపారు. జొన్న పంటకు ప్రభుత్వం రూ. 3,699 మద్దతు ధర ప్రకటిస్తే, బహిరంగ మార్కెట్లో కేవలం రూ. 2,700 నుండి రూ. 3,000 లోపే పలుకుతుండటంపై ప్రభుత్వం తక్షణ చొరవ తీసుకుంటుందన్నారు.
మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు MSME రంగంలో ఉన్న భూవివాదాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన జలాశయాలలో 75 టీఎంసీల (TMC) నీటి నిల్వ ఉండటం సంతృప్తికరంగా ఉందన్నారు.
సోమశిల, కండలేరు జలాలను జాగ్రత్తగా వాడుకోవాలి: మంత్రి ఆనం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల నేపథ్యంలో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని, సాగునీటి శాఖలో ఏ మాత్రం వృథా కాకుండా ప్రతి చుక్కను రైతులకు అవసరమైన మేరకే విడుదల చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. జిల్లాలో దాదాపు 46 వేల ఎకరాల్లో 4,000 మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నప్పటికీ, టొబాకో బోర్డులో జిల్లాకు కనీస ప్రాతినిధ్యం లేదన్నారు. దీనిపై స్పందించి భవిష్యత్తు సమావేశాలకు నెల్లూరు ప్రతినిధులను తప్పకుండా ఆహ్వానిస్తామని వ్యవసాయ శాఖ మరియు సహచర మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారని మీడియాకు వివరించారు.
చింతలదేవి ఒంగోలు జాతి ఎద్దుల బ్రీడింగ్ సెంటర్‌కు కేంద్రం మంజూరు చేసిన కామధేను ప్రాజెక్టుకు గతంలో నీటి వసతి కల్పించలేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక GKN కెనాల్ రాళ్లపాడు ప్రాజెక్ట్ సమీపంలో ఒక సోర్స్ ఏర్పాటు చేసి, మర్రిగుంట చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా మార్చి పంపింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని, మిగిలిన 20% పనులను రాబోయే 2-3 మాసాల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అమృత్ పథకం కింద మంచినీటి సరఫరా కోసం రూ. 34 కోట్లు మంజూరై, టెండర్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు.
Nellore DRC Meeting 2026: కాలువల రిపేర్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున కండలేరు, సోమశిల జలాశయాల నీటి నిల్వలపై సమీక్షించి, సాగునీటి ప్రధాన కాలువల రిపేర్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి గతంలో యాప్ ద్వారా ఒక రైతుకు మొదట రెండు బస్తాల చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ, సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వం దాన్ని 3 బస్తాలకు పెంచుతూ అంగీకరించిందన్నారు.

పొగాకు బోర్డులో జిల్లాకు మెంబర్‌షిప్ కల్పించే ప్రతిపాదనపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని ఇక్కడే ఒక కీలక తీర్మానం పాస్ చేశామన్నారు. జిల్లాలో కాలనీల ఏర్పాటుకు, స్కూళ్ల నిర్మాణానికి ఉచితంగా స్థలాలు ఇచ్చిన దాతలను గౌరవిస్తూ.. ఆయా ప్రాంతాలకు సదరు దాతల పేర్లనే పెట్టాలని రిజల్యూషన్ చేసి ప్రభుత్వానికి పంపామన్నారు.
సొంత ఖర్చుతో 10 మిలియన్ల రొయ్య పిల్లల పంపిణీ: ఎంపీ బీదా
సమావేశంలో మంత్రి నారాయణ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇస్తూ.. నెల్లూరు ఎంపీ బీదా మస్తాన్ రావు తన ఎంపీ నిధుల నుండి కాకుండా, ఆయన సొంత కంపెనీ తరపున 10 మిలియన్ల (కోటి) ప్రాన్ సీడ్ (రొయ్య పిల్లలను) ఉచితంగా ఇస్తానని ప్రకటించడంపై ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. వీటిని జిల్లాలోని ప్రధాన సాగునీటి కాలువల్లో వదలడం ద్వారా వేటాడి రొయ్యలు పట్టుకునే నిరుపేద మత్స్యకార, సామాజిక వర్గాలకు ఎంతో ఆర్థిక బెనిఫిట్ అవుతుందన్నారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన మున్సిపల్ పరిధిలోని అల్లిపురం రోడ్డు సమస్యపై స్పందించి, వారం రోజుల్లో టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు. నెల్లూరు సిటీలో కడుతున్న ఫ్లాటెడ్ MSME పార్క్ సివిల్ పనులన్నీ పూర్తిగా పూర్తయ్యాయని, పెండింగ్ ఉన్న ఎలక్ట్రిసిటీ పనులను కూడా మరో 10 రోజుల్లో కంప్లీట్ చేసి పార్కును ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

