Jowar Procurement Medak: అన్నదాతలు ఎంతో కష్టపడి పండించిన జొన్న పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. రైతులు పండించిన ప్రతి గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే' అని తెలంగాణ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని దంతేపల్లి, కాట్రియల, పర్వతాపూర్, కిషన్ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన జొన్న రైతులు మంగళవారం నాడు మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (Medak Collectorate) ఎదుట భారీ ఎత్తున బైఠాయించి ఆందోళన నిర్వహించారు. జొన్నల కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ధర్నాకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నేరుగా హాజరై రైతులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ (Markfed) అధికారులు నాణ్యత పేరుతో, మట్టి పేళ్లలు ఉన్నాయనే చిన్న సాకుతో ఇప్పటికే సేకరించిన జొన్న లోడ్లను తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
వ్యవసాయ మంత్రి తుమ్మలతో ఫోన్ లో మాట్లాడిన పద్మా దేవేందర్ రెడ్డి
ధర్నాను ఉద్దేశించి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత సాకుతో మార్క్‌ఫెడ్ అధికారులు జొన్నలను తిరస్కరించడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గంభీర సమస్యపై ఆమె ధర్నా స్థలం నుండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. మార్క్‌ఫెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో జొన్నలను వెనక్కి పంపుతూ రైతులను వేధిస్తున్న తీరును మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జొన్నల కొనుగోలుపై జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ కార్యాలయం నుండి కదిలే ప్రసక్తే లేదని ఆమె అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడితో పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడే 'వంటావార్పు' (Vanta Varpu Protest) కార్యక్రమం చేపట్టి, రైతుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు.
Jowar Procurement Medak: మొలకెత్తిన ధాన్యాన్నే కొన్నాం.. జొన్నలను ఎందుకు కొనరు? - శేరి సుభాష్ రెడ్డి
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది నమ్మి జొన్న పంట సాగు చేసిన రైతులకు బహిరంగ మార్కెట్‌లో సరైన ధర లేక, ప్రభుత్వ కొనుగోళ్లు సకాలంలో ప్రారంభం కాక నిలువునా నష్టపోతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అకాల వర్షాలకు మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం మానవీయ కోణంలో ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు కేవలం మట్టి పేళ్లలు ఉన్నాయనే చిన్న కారణంతో జొన్నలను రిజెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ (DM) బాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) అంబదాస్ ధర్నా స్థలానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని కేంద్రాల్లో జొన్నలను ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేస్తామని, వెనక్కి పంపిన స్టాక్‌ను కూడా తిరిగి తీసుకుంటామని అధికారికంగా హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు.

ఈ భారీ నిరసన కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరేళ్ళ మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాత రావు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి చరిత పాల్గొన్నారు. ఇంకా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎస్కే అహ్మద్, ఉమామహేశ్వర్, శ్యామ్, నవీన్, దోమకొండ శ్రీను, అస్నుద్దిన్, విజయ భాస్కర్ రెడ్డి, సత్యపాల్, కిషన్ బాబు, సంతోష్, శ్రవణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్, నర్సింగరావు, పట్టణ నేతలు లింగారెడ్డి, ప్రభు రెడ్డి, మోచి కిషన్, ఇందాద్, సాయి, కిరణ్, ఎంబీపూర్ మహేష్, స్వామి నాయక్ మరియు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com

