Jurala Power Generation Starts: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల వరప్రదాయినిగా పిలువబడే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి శరవేగంగా ప్రారంభమైంది.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో గంటగంటకూ పెరుగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి స్టారట్
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి పెరుగుతున్న తరుణంలో, జల విద్యుత్ కేంద్రంలోని మొత్తం 6 యూనిట్ల ద్వారా అధికారులు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. నిరంతర విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు విద్యుత్‌ను అందిస్తూనే, మరోవైపు విడుదలయ్యే నీటిని కృష్ణా ప్రధాన నదిలోకి వదులుతున్నారు.
Jurala Power Generation Starts: ప్రస్తుత ఇన్ ఫ్లో - అవుట్ ఫ్లో వివరాలు
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రస్తుతం 2,05,000 క్యూసెక్కుల (రెండు లక్షల ఐదు వేలు) ఇన్ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు భద్రతను దృష్ట్యా అధికారులు 27 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి స్పిల్‌వే మరియు పవర్ హౌస్ ద్వారా మొత్తం 2,14,338 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు.
నదీ పరివాహక తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు మరియు పశువుల కాపరులు కృష్ణా నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని, ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

