Ponnam Prabhakar: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై బీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బీఆర్ఎస్ శ్రేణులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రక్తం ప్యాకెట్లను వాడుతూ చౌకబారు విమర్శలకు దిగడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని గుర్తు చేసిన మంత్రి, ఈ ఘోర తప్పిదానికి బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ కుట్రలన్నింటినీ ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు.

ఎన్‌డీఎస్‌ఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే నీళ్లు నింపుతాం
సాగునీటి విడుదలపై మంత్రి పొన్నం స్పష్టతనిచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదిక సమర్పించి, నీటిని నిల్వ చేసుకోవచ్చని సూచిస్తే తాము తక్షణమే ఆ పనులు చేపడతామని స్పష్టం చేశారు. తాము ఎల్లప్పుడూ నిపుణులైన ఇంజనీర్ల సలహాల ప్రకారమే నడుచుకుంటామని, ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. తాత్కాలిక కరవు పరిస్థితులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్ వ్యవహారాలను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
Ponnam Prabhakar: కరవు ముప్పు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి: రైతులకు మంత్రి సూచన!
ఈ ఏడాది దేశంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల తలెత్తే కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు వ్యూహాలను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. సాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధ తతో ఉందన్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇలాంటి సంక్షోభ సమయాల్లో అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజాహితమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

