Jagga Reddy: కాళేశ్వరం ప్రాజెక్టును ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత, టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రతిష్టను మసకబార్చేందుకే ఆయన ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావును గట్టిగా నిలదీశారు.

అది కేంద్ర సంస్థ నిర్ణయం.. కాంగ్రెస్ సర్కార్‌ది కాదు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకూడదనేది కాంగ్రెస్ ప్రభుత్వ సొంత నిర్ణయం కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం నడుచుకుంటోందని గుర్తుచేశారు. ఒకవేళ ఆ బ్యారేజీల్లో గనుక నీటిని నింపితే అవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ముంపునకు గురవుతాయని NDSA హెచ్చరించిందని ఆయన వివరించారు.
Jagga Reddy: అందుకే కేసీఆర్ నిన్ను మంత్రి పదవి నుంచి తీసేశారు!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత నాసిరకంగా నిర్మించారని జగ్గారెడ్డి ఆరోపించారు. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు వైఫల్యాల వల్లే ప్రాజెక్టు దెబ్బతిన్నదని, ఆ కోపంతోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసే ముందు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులపై హరీశ్ రావు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి పదవి కావాలంటే కాంగ్రెస్‌లోకి రా..
“మూడు నెలల పాటు నీటిపారుదల శాఖను నా చేతుల్లో పెట్టండి” అంటూ హరీశ్ రావు విసిరిన సవాల్‌పై జగ్గారెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. హరీశ్ రావుకు అంతగా మంత్రి పదవి కావాలనుకుంటే.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఎద్దేవా చేశారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై అసెంబ్లీలో చర్చించేందుకు మాజీ సీఎం కేసీఆర్ నేరుగా సభకు రావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

