Comrade Kalyan Movie: కోన వెంకట్ సమర్పణలో వచ్చిన చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్'. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు భాను, నందు కథను అందించారు.
వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కథేంటి? శ్రీవిష్ణు నటన ఎలా ఉంది? దర్శకుడు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నారు? సినిమా చూడదగినదేనా? ఈ విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.
Mandadi Movie: ఓటీటీలోకి వచ్చేసిన 'మండాడి'.. సినిమా ఎలా ఉందంటే?
Comrade Kalyan Movie Review & Rating
Comrade Kalyan Movie: కథ
90వ దశకంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉన్న అటవీ ప్రాంతంలోకి జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో) అనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ వస్తాడు. అతనిపై మాస్టర్ దళం దాడి చేస్తుంది. మరొకవైపు మాడగుల అనే గ్రామంలో కళ్యాణ్ (శ్రీవిష్ణు) ఒక టాకీస్‌లో థియేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. అదే ఊరికి సితార (మహిమా నంబియార్) అనే తెలుగు అమ్మాయి ఒరియా అమ్మాయిలా నటిస్తూ వస్తుంది. సితారను చూసిన తొలిచూపులోనే కళ్యాణ్ ప్రేమలో పడతాడు.
సితార అన్న చేసిన అప్పుల కారణంగా బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) అనే వ్యక్తి ఆ కుటుంబాన్ని వేధిస్తుంటాడు. అప్పు తీర్చకపోతే సితారను బలవంతంగా పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తాడు. ఆ డబ్బును తానే చెల్లిస్తానని కళ్యాణ్ మాట ఇస్తాడు. మరి ఆ డబ్బు కోసం కళ్యాణ్ ఏం చేశాడు? సత్తి బాబు (సత్య), పళ్లం రాజు (ప్రభాస్ శీను), ఎస్సై అప్పలనాయుడు (బ్రహ్మాజీ)లతో కలిసి చేసే హంగామా ఏంటి? ఒక మామూలు ఆపరేటర్ కాస్తా 'కామ్రేడ్ కళ్యాణ్'గా ఎలా మారాడు? చివరికి తన ప్రేయసిని దక్కించుకున్నాడా లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
నక్సలిజం, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ తీరు అనేవి చాలా సీరియస్ అంశాలు. 'సింధూరం' వంటి చిత్రాల్లో క్లిష్టమైన ఈ పాయింట్‌ను ఎవరి వైపు మొగ్గు చూపకుండా హ్యాండిల్ చేశారు. అయితే 'కామ్రేడ్ కళ్యాణ్' రచయితలు భాను, నందులు ఈ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌ను నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా పూర్తిగా వినోదాత్మకంగా మార్చే ప్రయత్నం చేశారు.
ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో సాగిపోతుంది. సుదర్శన్-శ్రీవిష్ణు, సత్య-శ్రీవిష్ణు కాంబినేషన్లలో వచ్చే సన్నివేశాలు, పండించిన కామెడీ నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా దుబాయ్ బాబుగా సత్య కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుందని భావించినా, మేకర్స్ ఇక్కడ కూడా లాజిక్‌లను పక్కనపెట్టి ఫన్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కథ అడవిలోకి మారిన తర్వాత సీరియస్‌గా చెప్పాల్సిన సందేశాత్మక సన్నివేశాలు కూడా సిల్లీగా మారడం ఎమోషనల్ కనెక్టివిటీని తగ్గిస్తుంది.
నటీనటులు, సాంకేతిక వర్గం
- నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు తనదైన మ్యానరిజమ్స్, టైమింగ్ డెలివరీతో కామ్రేడ్ కళ్యాణ్‌గా నవ్వించారు. సత్య, సుదర్శన్, ఉపేంద్ర, మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలతో మెప్పించారు. హీరోయిన్ మహిమా నంబియార్‌కు తక్కువ సీన్లు ఉన్నప్పటికీ తెరపై అందంగా కనిపించారు. రాధికా శరత్ కుమార్ ఎంటర్‌టైనింగ్ పాత్రలో ఆకట్టుకోగా, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను తమ పరిధి మేర నటించారు.
- సాంకేతిక విభాగం: విజువల్స్ బాగున్నాయి, సంగీతం పెద్దగా గురతుండిపోకపోయినా వినడానికి బాగుంది. అయితే 90ల నాటి కథ అని చెప్పినప్పటికీ.. డైలాగ్స్, పంచ్‌లు, డబుల్ మీనింగ్స్ అన్నీ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ఉండటంతో కాలానికి తగిన ఫీల్ కలగదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
తుది తీర్పు
'కామ్రేడ్ కళ్యాణ్' ఎలాంటి లాజిక్‌లు వెతక్కుండా, కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ఒక మంచి ఆప్షన్. ఎమోషన్స్, సీరియస్ నక్సలిజం సబ్జెక్ట్‌ను ఆశించకుండా కేవలం శ్రీవిష్ణు, సత్యల మార్క్ కామెడీ కోసం ఈ వీకెండ్‌లో సరదాగా చూడదగ్గ టైమ్ పాస్ చిత్రం.
Rating: 2.5/5

