Congress : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చౌకబారు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆధ్యాత్మిక చింతనతో గుడికి వెళితే, దానిని ‘క్షుద్ర పూజలు’ అంటూ కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించిన కేటీఆర్, తమకు కాంగ్రెస్‌లాగా చిల్లర క్షుద్ర రాజకీయాలు చేయడం తెలియదని, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన రాష్ట్ర రాజకీయాలు (స్టేట్ పాలిటిక్స్) మాత్రమే తెలుసని స్పష్టం చేశారు. పాలన చేతగాక నిత్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత, ఆధ్యాత్మిక విశ్వాసాలపై కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

GRMB అజెండాపై మౌనం ఏల? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్ర నీటి హక్కులకు సంబంధించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) అజెండాలో ప్రతిపాదించిన 7 వివాదాస్పద అంశాలపై బిఆర్ఎస్ గళమెత్తినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా ఉన్న ఆ 7 అంశాలపై ఎందుకు మౌనంగా ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కీలకమైన నదీ జలాలు, ప్రాజెక్టుల హక్కులను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించడానికే హరీశ్ రావు పూజల అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతుల నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

