Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి గారు.. మా పోచంపల్లి రోడ్డు పరిస్థితి ఏమిటి?

మంత్రి గారు.. మా పోచంపల్లి రోడ్డు పరిస్థితి ఏమిటి?

వార్త 2 weeks ago

Choutkur to Pochampally Road: మంత్రి గారు.. మా రోడ్డు పరిస్థితి ఏమిటి? ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అని పోచంపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని చౌట్కూర్ నుంచి పోచంపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి రాకపోకలు దాదాపు దుర్భరంగా మారుతున్నాయి.

రహదారిపై ఎక్కడ చూసినా గుంతలు, బురద, నిలిచిపోయిన వర్షపు నీరే దర్శనమిస్తున్నాయి. ఈ దారిలో నడవాలన్నా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో జారిపడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

Read Also : TG Smart Ration Cards: ఈ నెల 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 Minister… what is the condition of our Pochampally road?

Choutkur to Pochampally Road: చెప్పినా.. పట్టించుకోరా?

పోచంపల్లి రహదారి దుస్థితిపై గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో రహదారి మరింత దారుణంగా మారుతుందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యవసరమైతే పరిస్థితి ఏంటి?

గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం సంభవించినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా వాహనాలు ఈ రహదారిపై వెళ్లడం కష్టంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న అవసరం వచ్చినా గ్రామం నుంచి బయటకు రావాలంటే ఈ రహదారిపైనే ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని అంటున్నారు.

మంత్రి గారు.. ఇకనైనా స్పందించండి

అందోల్ నియోజకవర్గంలోని స్థానిక మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని పోచంపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారి పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా గుంతలు పూడ్చడంతో పాటు బురద సమస్యను తొలగించి, త్వరితగతిన శాశ్వత రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఒకవైపు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతుంటే.. మరోవైపు పోచంపల్లి ప్రజలు మాత్రం కనీస రహదారి సౌకర్యం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పోచంపల్లి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక ప్రజలు మరెంతకాలం ఈ నరకయాతన అనుభవించాల్సిందేనా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

ఉన్నట్టుండి కుండపోత.. మరుక్షణమే ఆకాశం నిర్మలం.. హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha