Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ప్రభావం పెరిగిందనే వార్తలు, వాటిపై చెలరేగిన రాజకీయ దుమారానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మీడియా ముందు తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. పార్టీని, నాయకులను తాను ఎప్పుడూ విమర్శించలేదని తేల్చిచెప్పారు.

పార్టీని, నాయకులను నేను విమర్శించలేదు: కోమటిరెడ్డి
తాను కాంగ్రెస్ పార్టీని గానీ, పార్టీలోని నాయకులను గానీ ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులోనూ విమర్శించే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, రాష్ట్రం ఏర్పడింది కూడా ఆ పార్టీ ద్వారానే అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన అడుగుజాడల్లోనే తాను పార్టీలో కొనసాగుతానని పునరుద్ఘాటించారు.
Komatireddy Rajagopal Reddy: దశాబ్దాల కార్యకర్తలు, ఉద్యమకారులకే నా ప్రాధాన్యత
పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి జెండా మోసిన అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారికి ప్రజా పాలనలో సముచిత స్థానం దక్కాలనే సదుద్దేశంతోనే తాను మాట్లాడినట్లు రాజగోపాల్ రెడ్డి వివరించారు. ఒకప్పుడు సీమాంధ్ర పాలకుల చేతుల్లో అష్టకష్టాలు పడిన తెలంగాణ, మళ్లీ పాత రోజులను చూడకూడదనే ఉద్దేశంతోనే హెచ్చరించానని తెలిపారు. ప్రభుత్వ వ్యవహారాలు లేదా పార్టీ పగ్గాలు కాంట్రాక్టర్ల చెప్పుచేతల్లోకి వెళ్లకూడదన్నదే తన ఆవేదన అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాపాలన అంటే కేవలం పేదల సంక్షేమమే
నిజమైన ప్రజా పాలన అంటే కేవలం పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల అభివృద్ధి కోసం కాదని, అణగారిన పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని కోమటిరెడ్డి హితవు పలికారు. సమాజంలోని నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలనేదే తన ఆకాంక్ష అని, అందుకోసం పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభించాలనే తాపత్రయంతోనే తాను మాట్లాడిన మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో గ్యాస్ కష్టాలు: ఈ-కేవైసీ గడువు ఉన్నా డెలివరీ నిలిపివేత

