Bengaluru Crime: ఎన్నో ఆశలతో తాము ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకుంటున్న నవవధువులు, కొద్దిరోజులకే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడుస్తున్న ఘటనలు మెట్రో నగరాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
తాజాగా సిలికాన్ సిటీ బెంగళూరులో ఇలాంటి ఘోర ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులను ఎదిరించి, ప్రేమించిన వాడిని పెళ్లాడిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్.. వివాహమైన నాలుగు నెలలకే ఇంట్లో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also :Palnadu Crime: అయ్యో పాపం.. ఏ కష్టం వచ్చిందో! ఇద్దరు కన్నబిడ్డలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య
రైలు ప్రయాణంలో పరిచయం.. ప్రేమగా మారిన బంధం

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకాకు చెందిన శ్వేత (25) గతంలో ఒక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ, విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేది. ఏడాదిన్నర క్రితం ఒక తీర్థయాత్రకు వెళ్తున్న సమయంలో రైలులో ఆమెకు మూర్తి (27) అనే యువకుడితో పరిచయమైంది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే మూర్తితో నంబర్లు మార్చుకున్న శ్వేత.. నిరంతరం మాట్లాడుతూ అతనితో ప్రేమలో పడింది. మూర్తిని వివాహం చేసుకుంటానని శ్వేత తన ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులను ఎదిరించి, నాలుగు నెలల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని సుంకదకట్టె పరిధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుండగా.. శ్వేత అక్కడి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా జాయిన్ అయింది.
ఆడపడుచు ఎంట్రీ.. కట్నం వేధింపుల పర్వం
పెళ్లి సమయంలో తాము అదనపు కట్నం ఇచ్చుకోలేమని శ్వేత తల్లి స్పష్టం చేయగా, అందుకు మూర్తి కుటుంబం అంగీకరించింది. అయితే, వివాహమైన కొద్దిరోజులకే కథ మారింది. మూర్తిని చిన్నతనం నుండి సాకిన అతని సవతి సోదరి (అక్క) నరసమ్మ వీరి ఇంటి సమీపంలోనే నివసించేది. ఆమె తరచూ శ్వేత ఇంటికి వస్తూ, పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురావాలంటూ మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. మూర్తి తన సోదరి నరసమ్మ మాటలకే విలువ ఇస్తూ శ్వేతను వేధించడంతో దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు జరిగేవి. ఆదివారం సైతం వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో, శ్వేత తీవ్ర మనస్తాపానికి గురై పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహానికి వెళ్లిపోతానని చెప్పి ఇల్లు వదిలింది.
Bengaluru Crime:సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన తల్లితో మాట్లాడిన శ్వేత, తిరిగి అద్దె ఇంటికి చేరుకుంది. ఇల్లు తాళం వేసి ఉండటంతో ఓనర్ నుంచి అదనపు కీ తీసుకుని లోపలికి వెళ్లింది. రాత్రి భర్త మూర్తి ఇంటికి వచ్చేసరికి శ్వేత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు శ్వేత రాసిన భావోద్వేగ భరిత సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “అమ్మా.. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా చావుకు నా భర్త మూర్తి, అతని సోదరి నరసమ్మే కారణం. మమ్మల్ని ఇష్టమైన రీతిలో బతకనివ్వకుండా చేశారు. ఆ ఇద్దరినీ అస్సలు విడిచిపెట్టవద్దు” అని లేఖలో పేర్కొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త మూర్తితో పాటు అతని సోదరి నరసమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

