Gen-Z Reels : సోషల్ మీడియాలో నేటితరం 'జెన్-జీ' (Gen-Z) యువత చేస్తున్న నిరసన రీల్స్ చూస్తుంటే వాంతి వచ్చేలా ఉందంటూ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు సోనూసూద్ తీవ్రంగా స్పందించారు.
కంగన చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించడమే కాకుండా మీడియా వేదికగా ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు. సమాజంలో యువత పాత్ర ఎంతో కీలకమని, వారు తమ నిరసనను తెలిపే క్రమంలో చేసే ప్రయత్నాలను అగౌరవపరచడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు మరింత విచక్షణతో వ్యవహరించాలని సోనూసూద్ హితవు పలికారు.

‘ప్రజలే దేవుడితో సమానం’.. సెలబ్రిటీల బాధ్యతను గుర్తుచేసిన నటుడు
నటులుగా సమాజంలో తాము ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ప్రజలు మరియు నేటి యువత ఇచ్చిన ఆదరణేనని సోనూసూద్ గుర్తుచేశారు. “ఎవరు ఏ హోదాలో లేదా ప్రొఫెషన్‌లో ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ ప్రజలతో కనెక్ట్ అయి ఉండటం చాలా ముఖ్యం. కంగనా రనౌత్ నిజంగానే ఆ రీల్స్ చూస్తే వాంతి వస్తుందని వ్యాఖ్యానించి ఉంటే అది యువతను తీవ్రంగా అవమానించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుడితో సమానం, వారి అభిప్రాయాలను వినాలి, గౌరవించాలి” అని ఆయన స్పష్టం చేశారు. కంగన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సోనూసూద్ ఇచ్చిన స్పందనపై నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

