Sai Krishna lock-up death case : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మేజిస్ట్రేట్ విచారణ సందర్భంగా హృదయ విదారకర దృశ్యం చోటుచేసుకుంది.
ఈ విచారణకు హాజరైన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయమూర్తి ఎదుట తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. “నాకు ఆస్తులు, అంతస్తులు, ప్రభుత్వ డబ్బులు ఏమీ వద్దు.. కనీసం నా కొడుకు అస్థికలైనా నాకు అప్పగించండి, నేను చివరిసారిగా అంతిమ సంస్కారాలు చేసుకుంటాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తన కొడుకు అవశేషాలను ఇవ్వకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. కృష్ణలంక సీఐ నాగరాజు లాంటి దుర్మార్గులైన పోలీసు అధికారుల నిర్వాకం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని, అలాంటి వారిని సమాజంలో బతకనివ్వకూడదంటూ ఆమె తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు.
Gade Saikrishna caseచనిపోయాక కూడా తప్పుడు ప్రచారం.. న్యాయం కోసం తల్లి పోరాటం
తన కుమారుడిని లాకప్‌లో దారుణంగా హింసించి చంపడమే కాకుండా, మరణం తర్వాత కూడా అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విజయలక్ష్మి న్యాయస్థానం సాక్షిగా వాపోయారు. ఆధారాలను మాయం చేసేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని, ఇందుకు బాధ్యులైన కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజుతో పాటు అతనికి సహకరించిన మిగిలిన సిబ్బందిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు, కనీసం సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికేందుకు కొడుకు చితి బూడిదనైనా దక్కనివ్వకుండా చేయడం అన్యాయమన్నారు. ఈ లాకప్ డెత్ వ్యవహారంపై సమగ్రమైన మరియు నిష్పక్షపాత విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు.
ఏపీలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

