Krishi Thapanda: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కృషి తపండా నివాసంలో ఓ వ్యాపారవేత్త ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
బెంగళూరులోని ఆర్.ఆర్. నగర్‌లో ఉన్న ఆమె అపార్ట్‌మెంట్‌లో వైశాఖ్ (33) అనే వ్యాపారవేత్త బుధవారం రాత్రి ఉరివేసుకుని విగతజీవిగా మారారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చివరి నిమిషంలో నటికి మెసేజ్‌లు.. భార్యతో విడాకులు, రూ. 7 కోట్ల దోపిడీ కేసుతో లింకు!
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బుధవారం రాత్రి ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలోనే వైశాఖ్ ఈ విపరీత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నటి కృషి ఇంట్లో లేరని తెలిసింది. అయితే, బలవన్మరణానికి పాల్పడటానికి కొన్ని నిమిషాల ముందు వైశాఖ్ ఆమెకు కొన్ని సందేశాలు (Messages) పంపించారు. ఆ మెసేజ్‌లు చూసి కంగారుపడిన కృషి.. వెంటనే వైశాఖ్ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. కానీ, వారు వచ్చేసరికే ఘోరం జరిగిపోయింది.
కెంగేరి ప్రాంతానికి చెందిన వైశాఖ్, నటి కృషికి అత్యంత సన్నిహితుడని.. కొంతకాలంగా ఆమె ఫ్లాట్ లోనే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత, కుటుంబ కలహాల కారణంగా ఇటీవలే అతను తన భార్యతో విడిపోయాడని, ఆ మానసిక డిప్రెషన్ తట్టుకోలేక ఒక ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, గత ఫిబ్రవరి నెలలో జరిగిన రూ. 7 కోట్ల భారీ దోపిడీ కేసులో వైశాఖ్ నిందితుడిగా ఉన్నాడని, ఆ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Krishi Thapanda: కుటుంబ సభ్యుల అనుమానాలు.. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఆర్.ఆర్. నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. వైశాఖ్ మరణంపై అతని కుటుంబ సభ్యులు కొన్ని సందేహాలు వ్యక్తపరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు.

