Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైన కవిత, తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై నిజామాబాద్‌లో జరిగిన 'పాంచజన్య' సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
పార్టీ కోసం తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, పెద్ద నాయకులే స్వయంగా ఆ విషయం చెప్పారని గుర్తుచేశారు. కానీ, కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన తనను అదే పార్టీ నుంచి బయటకు గెంటేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. “నాతో ఎందుకు ఇలా చేయాలి?” అంటూ ఆమె వేదన వ్యక్తం చేశారు.

కన్నీళ్లు పిరికితనం కావు – ఆవేశం, బాధే కారణం
సొంత పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ గడ్డపై అడుగుపెట్టిన కవిత, బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. తాను స్టేజీపై కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన పిరికిదాన్ని కానని స్పష్టం చేశారు. ఆ కన్నీళ్లు కేవలం తనలో ఉన్న బాధ, ఆవేశం వల్ల వచ్చినవేనని వివరించారు. కవిత బోరున విలపించడం చూసి సభలో ఉన్న మహిళలు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు “కవిత సీఎం.. సీఎం” అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.
Kavitha: పుట్టినిల్లు దూరం చేసినా.. అత్తమామల ఆదరణ
తెలంగాణలో ఇంకా ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేయాలనే ఉద్దేశంతోనే తాను కొత్త పార్టీని స్థాపించానని కవిత తెలిపారు. తనను సొంత పుట్టినిల్లు లాంటి పార్టీ నుంచే బయటకు పంపించేశారని ఆవేదన చెందారు. తాను ఏకంగా ఆరు నెలల పాటు తీహార్ జైలులో ఉండి వచ్చినా పుట్టినిల్లు తనను ఆదరించలేదని వాపోయారు. అదే సమయంలో తన అత్తమామలు ఒక్క మాట కూడా అనకుండా కన్నబిడ్డలా చూసుకుంటూ గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఎలాంటి తప్పు చేయకపోయినా తనను తీహార్ జైలుకు పంపిన వారికి రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా గట్టిగా బుద్ధి చెబుతానని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు – కొత్త రాజకీయ శక్తి అవసరం
రాష్ట్రంలో నెలకొన్న విభిన్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక బలమైన కొత్త రాజకీయ శక్తి ఎంతో అవసరమని కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో కనీసం ఒక్క ఎకరానికైనా సాగునీరు అందిందా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన పాలకులను ప్రశ్నించడంలో బీఆర్ఎస్ ఎందుకు వెనకంజ వేస్తోందని నిలదీశారు. తాను ఎవరికీ భయపడని ‘నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని’ నేను పిరికిదాన్ని కాదని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

