Electricity Bills: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు నవంబర్ నెల నుంచి అదనపు కరెంట్ బిల్లు భారం మొదలైంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) ఆమోదించిన ట్రూ-అప్ ఛార్జీల వసూలు ప్రక్రియ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల్లో అదనపు మొత్తం కనిపించనుంది.
ఈ ఛార్జీల రూపంలో నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు వసూలు చేయనున్నారు.
Read Also :Gold Rate Today: బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. వెండి మాత్రం తగ్గుముఖం!
డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు అదనం

విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ కొనుగోలు, సరఫరా కోసం గతంలో అంచనా వేసిన ఖర్చులకు, వాస్తవంగా అయిన ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ట్రూ-అప్ విధానాన్ని ఉపయోగిస్తాయి. ఈ మొత్తాన్ని అర్హులైన విద్యుత్ వినియోగదారుల నుంచి విడతల వారీగా వసూలు చేసేందుకు TGERC అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం నవంబర్ నెల బిల్లుల్లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు అదనంగా వసూలు చేస్తారు. అయితే ఈ లెక్కింపు ప్రస్తుత నెలలో వినియోగించిన విద్యుత్ యూనిట్ల ఆధారంగా కాకుండా, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో సంబంధిత కనెక్షన్ వినియోగించిన విద్యుత్ ఆధారంగా జరుగుతుంది.
రూ.5,420 కోట్ల వసూలుకు ఆమోదం
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ మొత్తాన్ని TGERC ఆమోదించింది. ఇందులో వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను అర్హులైన వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ మొత్తంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో రూ.4,222.93 కోట్లు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో రూ.1,197.30 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
ఎన్ని నెలల పాటు వసూలు చేస్తారు?
ఈ ట్రూ-అప్ ఛార్జీలను ఒకేసారి కాకుండా విడతల వారీగా వసూలు చేయనున్నారు. TGSPDCL పరిధిలో 29 బిల్లింగ్ నెలల పాటు, TGNPDCL పరిధిలో 26 బిల్లింగ్ నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యవసాయ వినియోగదారుల నుంచి ఈ మొత్తాన్ని నేరుగా వసూలు చేయరు. వారి వాటాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కమిషన్ సూచించింది. ట్రూ-అప్ ఛార్జీలను సాధారణ విద్యుత్ ఛార్జీల్లో కలపకుండా బిల్లులో ప్రత్యేకంగా చూపించాలని TGERC ఆదేశించింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం, లెక్కింపునకు తీసుకున్న నెలవారీ విద్యుత్ వినియోగం, వర్తింపజేసిన యూనిట్ రేటు వంటి వివరాలను బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.
Electricity Bills: ట్రూ-అప్ ఛార్జీలు అంటే ఏమిటి?
సాధారణంగా విద్యుత్ సంస్థలు భవిష్యత్తులో విద్యుత్ కొనుగోలు, సరఫరా కోసం అయ్యే ఖర్చును ముందుగానే అంచనా వేస్తాయి. అయితే వాస్తవంగా ఖర్చు ఆ అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. అంచనా ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నియంత్రణ కమిషన్ పరిశీలించి సర్దుబాటు చేయడాన్నే ట్రూ-అప్ అంటారు. ఈ ప్రక్రియలో ఆమోదించిన అదనపు మొత్తాన్ని నిబంధనల ప్రకారం వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.

