YS Jagan: రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో కొనసాగుతుందో చెప్పడానికి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఘటనే నిలువెత్తు నిదర్శనమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని గురువారం ఆయన ములాఖత్‌లో భాగంగా పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ప్రతిపక్ష నాయకులపై తీవ్రస్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రిని కూడా అవమానించేలా శాడిస్టిక్ చర్యలు
ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కావు.. ఈరోజు మీరు నాటుతున్న తప్పుడు విత్తనాలు రేపు మహావృక్షాలై మిమ్మల్ని చుట్టుకుంటాయి. తాను ఇవాళ జైలుకు వెళ్లిన సమయంలో తనను కూడా అవమానించే దుర్మార్గపు ప్రయత్నం చేశారని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జైలుకు వెళితే తనను లోపల కూర్చోబెట్టి ఫోటో తీయకుండా, గ్రిల్స్ బయట నిలబెట్టి ఫోటోలు తీయించారని పేర్కొన్నారు. ఇది చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. తమ హయాంలో ‘పీపుల్ ఫ్రెండ్లీ’ పోలీస్ వ్యవస్థను తీసుకువస్తే, నేడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలను అవమానించే కొత్త సంస్కృతికి తెరలేపిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఈ దుర్మార్గపు పాలనకు ప్రజలు త్వరలోనే తగిన విధంగా చరమగీతం పాడతారని హెచ్చరించారు.
YS Jagan: బాధితులే నిందితులుగా మార్పు: సంగాల గ్రామం ఘటన వెనుక అసలు నిజాలు
ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో నేరం జరిగినప్పుడు బాధితులే నిందితులుగా మారుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణిచివేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఆగస్టు 1న చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో తమ పార్టీ కార్యకర్త గిరి తనపై దాడి జరుగుతోందని, రక్షించాలని రాత్రి 7:45 గంటలకు ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేసి వీడియోలు పంపాడని ఆధారాలతో సహా వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాత్రి 7:47 గంటలకు స్థానిక ఎస్సైకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా, కార్యకర్తను కాపాడటానికి వెళ్లిన ఎమ్మెల్యేపైనే దాడి చేసి, ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టారని జగన్ ఆరోపించారు.
అర్ధరాత్రి దొంగల్లా వచ్చి.. ఒకే వ్యక్తిపై రెండుసార్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు
దాడికి గురైన ఎమ్మెల్యే విరూపాక్షి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా, అర్ధరాత్రి 2:45 గంటలకు వందల మంది పోలీసులు దొంగల్లా ఆయన ఇంటిపై పడి తలుపులు, సీసీ కెమెరాలను ధ్వజం చేశారని మండిపడ్డారు. ఏదో ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా అరెస్టు చేసి, గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 38 మందిపై మూడు వేర్వేరు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని తెలిపారు. ఒకే వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్‌లో రెండుసార్లు చేర్చడాన్ని బట్టి ఈ కేసు ఎంత పెద్ద కట్టుకథో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
బీసీ, మైనారిటీ నాయకత్వాల అణచివేతకు కుట్ర
ఈ ప్రభుత్వం కావాలనే బీసీ, మైనారిటీ వర్గాల బలమైన నాయకత్వాన్ని రాజకీయంగా అణచివేసేందుకు కుట్రలు పన్నుతోందని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి బైక్ యాక్సిడెంట్‌ను హత్యాయత్నంగా చిత్రీకరించడం, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కిడ్నాప్ కేసులు బనాయించడం, కారుమూరు సునీల్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం అన్నీ ఈ కుట్రలో భాగమేనని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు..!

