KCR: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై మునుపెన్నడూ లేనంత ఘాటుగా విరుచుకుపడ్డారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ దుర్మార్గుల పాలనకు విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా శాశ్వతంగా బహిష్కరించారని ఆయన నల్గొండ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. గత బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసంపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని ప్రతిపక్షానికి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఇరు పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల అమలు, ఇచ్చిన హామీల ప్రగతిపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా సుదీర్ఘ చర్చ పెట్టడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే ప్రతిపక్ష నేతలు సభకు రావాలని సవాల్ విసిరారు.
CM Revanth Reddy ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై తీవ్ర వ్యాఖ్యలు.. ‘పాపాల భైరవుడు’ అంటూ ధ్వజం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంచలన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రమైన పదజాలంతో కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చివరకు భార్యాభర్తల వ్యక్తిగత ఫోన్ సంభాషణలను కూడా ట్యాప్ చేసి విన్న వికృత మనస్తత్వం వారిదని మండిపడ్డారు. “అలాంటి పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి? సొంత పౌరుల రహస్యాలను దొంగతనంగా విన్న వాడిని ఏం చేయాలి.. చేయితో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా?” అంటూ రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దావానలంలా వ్యాపించాయి. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిన వారు ఈరోజు ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని సీఎం ఎద్దేవా చేశారు.

