Minister Bhagirath Choudhary : కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి ఏకంగా రూ. 99.60 లక్షల ప్రభుత్వ రాయితీని (సబ్సిడీ) సొంతం చేసుకోవడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశంలో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించేందుకు మరియు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం భారీ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఉపయోగించుకుని, మంత్రి భగీరథ్ చౌదరి సుమారు మూడు నెలల క్రితం తన వ్యక్తిగత పొలంలో కీరదోస (Cucumber) సాగు చేసినందుకు గాను ఈ భారీ మొత్తాన్ని రాయితీ రూపంలో పొందారు. ఒక సామాన్య రైతుకు దక్కాల్సిన ఇంత పెద్ద మొత్తాన్ని, వ్యవసాయ శాఖలోనే కీలక పదవిలో ఉన్న కేంద్రమంత్రే నేరుగా తన ఖాతాలో వేసుకోవడం నైతికంగా తప్పని, ఇదొక సరికొత్త అధికారిక అవినీతి అంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగాయి.

మంత్రి సమర్థన.. ప్రతిపక్షాల అవినీతి విమర్శలతో హీటెక్కిన రాజకీయం!
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించడంతో, కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి ఈ వివాదంపై స్పందించారు. తాను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఒక రైతునని, దేశంలో ఏ సాధారణ రైతుకైనా వర్తించే నిబంధనలే తనకూ వర్తిస్తాయని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చట్టప్రకారం, అర్హతలను బట్టే మిగతా రైతుల తరహాలోనే తన ఖాతాకు కూడా ఈ నిధులు వచ్చాయని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, దేశంలో లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు స్వల్ప సబ్సిడీల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తరుణంలో.. ఏకంగా వ్యవసాయ శాఖ సహాయమంత్రికే ₹99 లక్షల సబ్సిడీ క్షణాల్లో మంజూరు కావడం వెనుక అధికార దుర్వినియోగం ఉందంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ సబ్సిడీ వివాదం రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లోనూ సెగలు రేపేలా కనిపిస్తోంది.

