Kerala Weather Update: నైరుతి రుతుపవనాల రాకతో కేరళ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జూన్ 4న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ప్రస్తుత సీజన్‌లోనే మొదటిసారిగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర కేరళలోని ఐదు జిల్లాల్లో ముంచెత్తే వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
KeralaRains
Read also: Ebola Virus: జైపూర్‌లో ఉగాండా మహిళకు ఎబోలా వైరస్ !
కోజికోడ్‌లో ఈదురు గాలుల బీభత్సం
శుక్రవారం ఉదయం కోజికోడ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో బలమైన ఈదురు గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శనివారం మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గడ్ జిల్లాల్లో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆదివారం కూడా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొంది.
Kerala Weather Update: జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు
పరిస్థితి తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు అలర్ట్‌లను జారీ చేసింది:
రెడ్ అలర్ట్: మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గడ్.
ఆరెంజ్ అలర్ట్: ఇడుక్కి, త్రిస్సూర్, ఎర్నాకుళం, కొట్టాయం, పాలక్కాడ్, పతనంతిట్ట.
ఎల్లో అలర్ట్: అలప్పుజ, కొల్లం, తిరువనంతపురం.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ సహాయక శిబిరాలకు తరలివెళ్లాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) సూచించింది. పర్యాటక ప్రాంతాలు, నదులు, కొండ ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సాయం కోసం ప్రజలు 1077, 1070 నంబర్లను సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also:
విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!

