Kadiyam Srihari: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల కమిటీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, నియోజకవర్గంలో పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి అందరూ పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పాత, కొత్త భేదాలు వీడాలని పిలుపు
పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కడియం శ్రీహరి.. నాయకులు మరియు కార్యకర్తలు ఎలాంటి పాత, కొత్త భేదాలకు తావివ్వకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. కేవలం పార్టీ పేరును అడ్డంపెట్టుకుని లబ్ది పొందే సంస్కృతిని విడనాడాలని స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం అంతా సమష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు.
Kadiyam Srihari: బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కడియం శ్రీహరి మండిపడ్డారు. గడిచిన పన్నెండు సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క జాతీయ స్థాయి సంస్థను గానీ, కనీసం వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును గానీ కేటాయించలేదని విమర్శించారు. కేవలం కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేయడమే బీజేపీ ప్రధాన అజెండాగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కడియం శ్రీహరి సవాల్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కడియం శ్రీహరి సంచలన ప్రశ్నలు సంధించారు. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో కల్వకుంట్ల కుటుంబం తమ పేరున ఒక్క ఎకరం భూమి కూడా లేదని చూపించిందని గుర్తుచేశారు. అలాంటిది, పదేళ్ల అధికార పాలన ముగిసేసరికి వారికి వందల ఎకరాల భూములు, లగ్జరీ ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. 2014కి ముందున్న ఆస్తుల వివరాలకు, నేడు ఉన్న అపార సంపదకు పొంతన ఏమిటో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని ఆయన నేరుగా సవాల్ విసిరారు.
మద్దూర్‌లో జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ

