Ketan Agarwal Case: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్టర్ కేతన్ అగర్వాల్ (25) హత్య కేసులో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)ల పోలీసు కస్టడీ ముగియడంతో శనివారం వారిని వడ్గావ్ మావల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల వాదనలు విన్న న్యాయస్థానం వారికి 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోటపై నుండి కేతన్‌ను కిందకు తోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు వీరిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జరిపిన విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్‌ను హత్య చేయడానికి నిందితులు నెల రోజుల ముందే పక్కా ప్లాన్ వేసినట్లు తేలింది. మే నెలలోనే పూణెలోని లూల్లానగర్ సమీపంలో ఉన్న ఒక క్లబ్ వద్ద కేతన్‌ను కొండపై నుండి ఎలా తోసేయాలో వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్ (రిహార్సల్) చేసినట్లు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు. పక్కా వ్యూహంతోనే కేతన్‌ను లోహగఢ్ కోటపైకి తీసుకెళ్లి లోయలోకి నెట్టేసినట్లు విచారణలో స్పష్టమైంది.
Read Also: Canada Super Visa Processing: సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
Ketan Agarwal murder case: Sia and Chetan remanded to 14 days of judicial custody.
Ketan Agarwal Case: సీన్ రీక్రియేషన్.. కీలక ఆధారాల సేకరణ
కేసును పటిష్టం చేసేందుకు జులై 2న ప్రధాన నిందితురాలు సియా గోయల్‌ను పోలీసులు లోహగఢ్ కోట ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. హత్య జరిగిన రోజున సియా ధరించిన దుస్తులను కూడా పోలీసులు ఆమె నివాసం నుండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, నిందితుల మొబైల్ డేటా, హత్య జరిగిన సమయంలో వారి లొకేషన్ వివరాలు, కాల్ రికార్డులతో సహా బలమైన సాంకేతిక, డిజిటల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. ఈ దారుణ హత్య వెనుక ఉన్న మరిన్ని రహస్యాలను, అసలు మోటివ్‌ను పూర్తిగా రాబట్టడానికి నిందితులిద్దరికీ పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుమతించాల్సిందిగా వడ్గావ్ మావల్ కోర్టును పోలీసులు అభ్యర్థించారు. పోలీసుల విన్నపంపై స్పందించిన న్యాయస్థానం.. నిందితులకు నోటీసులు జారీ చేస్తామని, వారి సమ్మతిని రికార్డ్ చేసిన తర్వాతే పాలిగ్రాఫ్ పరీక్షలపై తదుపరి నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com

