Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కె.వి.ఆర్ యూట్యూబ్ 14 రోజుల రిమాండ్

కె.వి.ఆర్ యూట్యూబ్ 14 రోజుల రిమాండ్

వార్త 3 weeks ago

KVR TV Venkatarami Reddy : రాజ్యాంగాన్ని అత్యంత అసభ్యకర పదజాలంతో దూషిస్తూ కించపరిచారనే దేశద్రోహ ఆరోపణలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు చేసిన హైదరాబాద్‌కు చెందిన 'కేవీఆర్ టీవీ' (KVR TV) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కే.

వెంకటరామిరెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గురువారం నాడు బొబ్బిలి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం. రోహిణీరావు నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.

బొబ్బిలి రూరల్ సీఐ ఎస్. శ్రీనివాసరావు నేతృత్వంలోని పోలీస్ బృందం మంగళవారం నాడు హైదరాబాద్‌లోని నిందితుని నివాసంలో అతడిని అదుపులోకి తీసుకుని, తీవ్ర ఉత్కంఠ మధ్య బుధవారం బొబ్బిలికి తరలించారు.

యూట్యూబ్‌లో బూతుల ప్రచారం - నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేవీఆర్ టీవీ నిర్వాహకుడు కే.వీ. రెడ్డి భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను బూతులతో కించపరుస్తూ మాట్లాడిన వీడియోలను, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను వ్యక్తిగతంగా దూషించిన వ్యాఖ్యానాలను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలు తమ సామాజిక భావాలను ఎంతో కించపరిచాయని పేర్కొంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ కండి రమేష్ గత ఏప్రిల్ 10వ తేదీన బాడంగి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన బాడంగి పోలీసులు గతంలో కేవీ రెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వెళ్లినప్పటికీ విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిందన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నిందితుడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ వెళ్లగా, నిందితుడి అనుచరుల తీవ్ర ప్రతిఘటన, హైడ్రామా మధ్య కేవీ రెడ్డిని విజయవంతంగా అరెస్ట్ చేసి విజయనగరం జిల్లాకు తరలించారు.

KVR TV Venkatarami Reddy : పోలీస్ స్టేషన్‌లో రాత్రి బస - సబ్‌జైలుకు తరలింపు

బుధవారం మధ్యాహ్నం బొబ్బిలి తరలించిన నిందితుడికి కోర్టు ఆదేశాల ప్రకారం ముందుగా స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుధవారం రాత్రే కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. తిరిగి గురువారం ఉదయం నిందితుడిని బొబ్బిలి కోర్టులో హాజరపరచగా, జడ్జ్ ఎం. రోహిణీరావు ఆదేశాల మేరకు కేవీరెడ్డిని స్థానిక సబ్‌జైలుకు తరలించారు. కాగా, నిందితుడిని మరింత విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

హైదరాబాద్‌లో సీఐపై రివర్స్ కేసు నమోదు

మరోవైపు ఈ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, చట్టపరమైన వేడిని రగిల్చింది. కేవీ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో బాడంగి, బొబ్బిలి పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ నిందితుడి భార్య హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బొబ్బిలి రూరల్ సీఐ ఎస్. శ్రీనివాసరావుపై ఎదురు కేసు పెట్టారు. పోలీసులు తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి, మహిళలని చూడకుండా బలవంతంగా నెట్టివేసి తన భర్తను అపహరించుకుపోయారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంతర్రాష్ట్ర పోలీస్ కేసు నమోదుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Epaper: epaper.vaartha.com

రాజధానిపై జగన్ సంచలన వ్యాఖ్యలు !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha