Kadiyam Srihari: కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌ల తీరుపై స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేకపోయారని విమర్శించారు. వీరి వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చెబుతున్న రూ. 13 లక్షల కోట్ల కేంద్ర నిధులలో తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టులు ఏవో స్పష్టం చేస్తూ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

Read also: LAW CET 2026 Results: తెలంగాణ లా సెట్ ఫలితాలు విడుదల
కాజీపేట రైల్వే డివిజన్ సాధనే లక్ష్యం.. కేంద్రంపై వివక్ష ఆరోపణలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల నాటి ఆకాంక్ష అయిన ‘కాజీపేట రైల్వే డివిజన్’ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కడియం శ్రీహరి పట్టుబట్టారు. ఈ డివిజన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ వేగవంతం కావడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గానీ, బీజేపీకి గానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఇష్టం లేదన్నారు. కేంద్ర మంత్రులు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
Kadiyam Srihari: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడే భాష బాలేదు.. అహంకారానికి నిదర్శనం
ఇదే ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ వైఖరిని కూడా కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఉపయోగిస్తున్న భాష, శైలి ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. “ప్రజల మద్దతుతో ఎన్నికైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 'తెలంగాణ ద్రోహి' అని సంబోధించడం కేటీఆర్ అహంకారపూరిత ధోరణికి అద్దం పడుతోంది” అని వ్యాఖ్యానించారు. అధికారాన్ని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవనే విషయాన్ని గతంలో ఆయన సోదరి (కవిత) సైతం ప్రస్తావించిన సంగతిని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ తన రాజకీయ ప్రవర్తనను, భాషను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

