Cannabis Chocolates : రైళ్ల ద్వారా మత్తు పదార్థాలను సులభంగా తరలించవచ్చనే నెపంతో నిందితులు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. ఒడిశాలోని బలరామపూర్ నుంచి హైదరాబాద్‌కు రైలు ద్వారా గంజాయి చాక్లెట్లను తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందింది.
దీంతో ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నిఘా పెంచిన ఎక్సైజ్ బృందం, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో శంకర్ సాహు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని వద్ద ఉన్న సామగ్రిని పరిశీలించగా, 385 గ్రాముల బరువున్న గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చంద్రమోహన్ వెల్లడించారు.

రిమాండ్‌కు నిందితుడు.. ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కఠిన చర్యలు!
పోలీసుల విచారణ అనంతరం నిందితుడు శంకర్ సాహును న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ.. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను ఏ రూపంలో రవాణా చేసినా, విక్రయించినా సహించేది లేదని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల రవాణా మరియు వినియోగంపై ‘ఎన్డీపీఎస్’ (NDPS) చట్టం కింద కఠినమైన కేసలు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. రైళ్లు, బస్సుల్లో నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై పర్యవేక్షణ మరింత తీవ్రతరం చేశామని తెలిపారు.

