Suryapet: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో అత్యంత విషాదకర ఘటన వెలుగు చూసింది. దసరా సెలవులను ఆస్వాదించడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి, కోతుల గుంపు భయపెట్టడంతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

కోతుల నుంచి తప్పించుకునే యత్నంలో కిందపడిన నిశాంత్
హైదరాబాద్‌లో ఉపాధి కోసం నివసించే మొక్క వీరబాబు దంపతుల కుమారుడు మొక్క నిశాంత్ గౌడ్ (12).. దసరా సెలవుల నిమిత్తం వల్లాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం తన స్నేహితుడితో కలిసి అమ్మమ్మ ఇంటి నుంచి స్వగృహానికి వెళ్తుండగా, దారిలో కోతుల గుంపు వారిని అకస్మాత్తుగా వెంబడించింది. వాటి బారి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు భయంతో పరుగులు తీసిన నిశాంత్ ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాలుడి కాలి బొటనవేలుకు బలమైన గాయమైంది.
Suryapet: ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంతిమ శ్వాస
పిల్లాడి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా ఆయన అందుబాటులో లేరు. దీంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, ప్రత్యామ్నాయంగా ఆటోలో ఖమ్మం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో అంబులెన్స్ ఎదురుకావడంతో బాలుడిని అందులోకి మార్చారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. తీవ్రమైన భయాందోళన మరియు టెన్షన్ కారణంగానే బాలుడు గుండెపోటుకు గురై మరణించి ఉండవచ్చని వైద్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నడిగూడెం ఎస్ఐ తేజస్విని వెల్లడించారు.

