Kukutlapally Primary School: ఎండల తీవ్రతతో అల్లాడుతున్న వేళ.. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతాంగానికి అండగా నిలుస్తూ కౌడిపల్లి చిన్నారులు వరుణదేవుడిని వేడుకున్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కుకుట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కప్పకు అభిషేకం చేయడం, “చినుకమ్మ ఓ చినుకమ్మ” పాటకు నృత్యం చేయడం ద్వారా అందరి మనసులను హత్తుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు స్థానిక చెరువుకు వెళ్లి నీటిని తీసుకొచ్చారు. అనంతరం సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కావడిలో కప్పను ఉంచి, వేపాకులు, వేప కొమ్మలతో అలంకరించి చెరువు నీటితో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు పడాలని కోరుతూ తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని చిన్నారులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించడం విశేషంగా నిలిచింది.
ఆ తర్వాత వ్యవసాయ పొలంలో “చినుకమ్మ ఓ చినుకమ్మ… ఒక్కసారి వచ్చి నేల తడిసిపోవమ్మా…” అనే పాటకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. చిన్నారుల అమాయక ప్రార్థనలు, వారి ఉత్సాహం, వర్షాల కోసం చేసిన వినూత్న వేడుక అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి.
Kukutlapally Primary School
ప్రస్తుతం వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చిన్నారులు రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూ వర్షాల కోసం ప్రార్థించడం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి పరిరక్షణ, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, గ్రామీణ సంప్రదాయాల విలువలను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని అందించారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని వీక్షించిన గ్రామస్థులు, తల్లిదండ్రులు, రైతులు చిన్నారులను అభినందించారు. “ఈ చిన్నారుల మనస్ఫూర్తి ప్రార్థనలతో అయినా వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని” వారు ఆకాంక్షించారు. చిన్నారుల ప్రార్థనలు… రైతన్న ఆశలు… వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న ఈ దృశ్యాలు అందరి హృదయాలను హత్తుకున్నాయి.
Epaper: epaper.vaartha.com

