హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ కోర్టు తాజాగా స్పందించింది. ఈ కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను ఏ-1గా పేర్కొంటూ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఆయనతో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ (ఏ-2), ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (ఏ-3)లకు కూడా నోటీసులు అందాయి. జులై 31వ తేదీన స్వయంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ మరియు పాలనాపరమైన వర్గాల్లో ఈ పరిణామం ఒక్కసారిగా వేడిని పెంచింది.
Read Also : ఎల్బీనగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి ICUలో చికిత్స

ఏమిటీ రూ. 55 కోట్ల వివాదం?
ఈ కేసు ప్రధానంగా 2023లో జరిగిన ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన నిధుల చెల్లింపుల చుట్టూ తిరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఎండీఏ (HMDA) అకౌంట్ నుంచి సుమారు రూ. 55 కోట్ల రూపాయలను ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’ (FEO) అనే విదేశీ సంస్థకు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే ఇంత పెద్ద మొత్తాన్ని విదేశీ సంస్థకు ఎలా బదిలీ చేశారన్న అంశంపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే బాధ్యులుగా ఉన్న వారిపై చార్జ్‌షీట్ దాఖలు కావడం, ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడం జరిగింది.
ముదురుతున్న రాజకీయ సెగ
ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చారు. ఏ-1గా కేటీఆర్ ఉండగా, ఏ-4గా కన్సల్టెంట్ కిరణ్, ఏ-5గా సదరు విదేశీ సంస్థ FEOను చేర్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఆర్థిక లావాదేవీలపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గతంలోనే అర్వింద్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోగా, ఇప్పుడు న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకోవడంతో కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

