Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుమురం భీం జిల్లాలో సీఎం పర్యటన.. ప్రజల్లో భారీ ఆశలు!

కుమురం భీం జిల్లాలో సీఎం పర్యటన.. ప్రజల్లో భారీ ఆశలు!

వార్త 2 weeks ago

Komuram Bheem District: ఆసిఫాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం నాడు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ప్రజల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.

సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఆయన ముందుగా కేరమేరి మండలం కొలం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేసి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే సాధారణ ప్రజలు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల సమస్యలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీలు ఇస్తారా? అనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, విద్యా పరమైన ప్రభుత్వ కళాశాలలు, పురాతన ఆలయాల అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పలు సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లినా ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కీలకమైన ఆడ (Ada Project), వట్టివాగు ప్రాజెక్ట్‌లకు అత్యవసర మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుతో పాటు పలు సాగునీటి స్కీములు నిధుల లేమితో నిలిచిపోగా, మరికొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన అత్యంత కీలకంగా మారింది.

 The Unfinished Gundi Bridge

వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ ప్రతినిధులు సీఎం(Komuram Bheem District) దృష్టికి స్థానిక సమస్యలను తీసుకెళ్లేందుకు వినతిపత్రాలతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ యువతకు స్థానిక ఉద్యోగ అవకాశాలు, గిరిజన రైతుల పంటలకు మద్దతు ధర, గూడాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై నివేదికలు రూపొందించారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉండి గిరిజన గ్రామాలకు శాపంగా మారిన గుండి, అన్నార్పల్లి, అప్పపల్లి వంతెనల నిర్మాణాలపై ఈ పర్యటనలోనే కీలక నిర్ణయాలు వెలువడాలని కోరుతున్నారు. అదేవిధంగా రెబ్బన (Rebbena) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం తక్షణమే చేపట్టాలని అక్కడి ప్రజలు గట్టిగా ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లా ప్రజలు మాత్రం కేవలం "హామీలు కాకుండా క్షేత్రస్థాయిలో పనులు అమలు కావాలి" అని స్పష్టం చేస్తున్నారు. సీఎం పర్యటనతో వెనుకబడిన కుమురం భీం జిల్లాకు కొత్త ఊపొచ్చి, పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.

 People waiting at the Rebbena railway gate.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రేపు 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు CM శ్రీకారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha