Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుప్పం ఇంఛార్జి బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ తొలగింపు

కుప్పం ఇంఛార్జి బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ తొలగింపు

వార్త 6 days ago

Kuppam Tdp: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగా స్థానిక నాయకత్వంలో ఊహించని మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గ వ్యవహారాలన్నింటినీ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయడంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Read also: Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్లిన ముగ్గురు ఏపీ భక్తులు దుర్మరణం

అమరావతి వేదికగా కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష

రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కుప్పం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో నియోజకవర్గ పరిణామాలు, పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ బాధ్యతల ప్రస్తావన రాగా.. కంచర్ల శ్రీకాంత్ గత కొంతకాలంగా తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు వెల్లడైంది. ఆయన వ్యక్తిగత విజ్ఞప్తిని పరిశీలించిన చంద్రబాబు, ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి శ్రీకాంత్‌కు విముక్తి కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

kuppam Tdp: కంచర్ల శ్రీకాంత్‌కు రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు?

బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ, కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్రస్థాయిలో విస్తృతంగా ఉపయోగించుకుంటామని చంద్రబాబు నేతలకు వివరించారు. ఇదే సమయంలో, శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి తన వ్యక్తిగత సహాయకుడిగా (PA) నియమించుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారంపై పార్టీ లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2023లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అనూహ్య విజయం సాధించిన శ్రీకాంత్.. శాసనమండలిలో విప్‌గా, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) పొలిటికల్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించి పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

కొత్త కో-ఆర్డినేటర్‌గా అనంతపురం నేత.. త్వరలోనే కుప్పం పర్యటనకు బాబు

కంచర్ల శ్రీకాంత్ నిష్క్రమణతో, కుప్పం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను అనంతపురం జిల్లాకు చెందిన మరో నేత శ్రీకాంత్‌కు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. స్థానిక నేతలంతా ఆయనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

త్వరలోనే తాను స్వయంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేడర్‌ను సమాయత్తం చేయాలని, ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha