Chikkaballapur Road Accident: బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44) పై అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కర్నూలు-1 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైన ఈ ఉదంతంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన కర్ణాటక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కర్నూలు నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరిన ఈ సూపర్ లగ్జరీ బస్సు.. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని దొడ్డపైలగుర్కి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఒక లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో, బస్సు అత్యంత వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు చొచ్చుకుపోయింది. డ్రైవర్ క్యాబిన్ నలిగిపోవడంతో పాటు కిటికీ అద్దాలన్నీ పగిలిపోయాయి.
Read Also : Journalist KVR wife Zero FIR: జర్నలిస్ట్ KVR భార్యపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు
Super luxury bus rams into lorry; two dead, including the driver!
Chikkaballapur Road Accident: క్రేన్ల సహాయంతో మృతదేహాల వెలికితీత
ఈ దారుణ ఉదంతంలో బస్సు డ్రైవర్ లక్ష్మణ్ (52)తో పాటు బెంగళూరులోని కల్యాణ్ నగర్‌కు చెందిన ప్రయాణికుడు ఉమాకాంత్ రావు (77) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పెరేసంద్ర పోలీసులు మరియు ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లారీ కింద ఇరుక్కుపోయిన బస్సు క్యాబిన్ భాగాన్ని విడదీసి, డ్రైవర్ లక్ష్మణ్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు ఒక భారీ క్రేన్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. అలాగే మృతి చెందిన ఉమాకాంత్ రావు దేహాన్ని కిటికీ గుండా బయటకు తెచ్చారు. గాయపడిన ఇతర ప్రయాణికులను చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
ఈ ఘోర ప్రమాదం కారణంగా బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో అర్ధరాత్రి వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు, లారీని రోడ్డుపై నుంచి తొలగించేందుకు పెరేసంద్ర పోలీసులు క్రేన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాహనాలను పక్కకు తొలగించిన అనంతరం హైవేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నారు.
హైవేపై ఘోరం.. కుటుంబం ముందే కారు డ్రైవర్‌పై అల్లరి మూక దాడి!

