ALS Academy School: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. తరగతి గదిలో క్రమశిక్షణ పేరిట ఐదేళ్ల నర్సరీ విద్యార్థిపై క్లాస్ మానిటర్ (ఒక బాలిక) సుమారు 12 నిమిషాల పాటు నిర్దాక్షిణ్యంగా దాడి చేసింది.
ముఖం, కళ్లపై తీవ్రమైన గాయాలు కావడంతో ఆ చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు. వృందావన్ యోజనలోని ‘ఏఎల్ఎస్ అకాడమీ’ (ALS Academy) లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
Read Also:Eluru Crime: దారుణం.. ఐదో తరగతి బాలికపై వృద్ధుడి లైంగిక దాడి!
టీచర్ వెళ్లగానే క్లాస్ రూమ్‌లో నరకం
లక్నో పిజిఐ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎల్ఎస్ అకాడమీలో బుధవారం ఉదయం ఈ దారుణం జరిగింది. తరగతి గదిలో 18 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయురాలు అందరినీ డెస్క్‌లపై తలలు దించుకుని పడుకోవాలని ఆదేశించింది. క్లాస్ మానిటర్‌గా ఉన్న ఒక బాలికకు వారిని చూసుకోవాలని బాధ్యత అప్పగించి క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. టీచర్ వెళ్లిన వెంటనే కొంతమంది పిల్లలు తల పైకెత్తగా ఆ మానిటర్ వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే 5 ఏళ్ల నర్సరీ విద్యార్థి తల పైకెత్తడంతో ఆగ్రహించిన మానిటర్, అతని డెస్క్ వద్దకు వెళ్లి చెంపలపై బలంగా కొట్టింది. ఆ చిన్నారి నొప్పితో ఏడుస్తూ తల దించుకోకపోవడంతో.. జుట్టు పట్టి లాగి, వీపుపై గుద్దుతూ దారుణంగా హింసించింది. భయపడిపోయిన ఆ చిన్నారి గది నుండి బయటకు పారిపోవడానికి ప్రయత్నించగా.. ఆ బాలిక అతనిని బలవంతంగా లోపలికి లాగి, తరగతి గది తలుపులకు గడియపెట్టింది. అనంతరం సీట్లోకి లాక్కెళ్లి నిరంతరాయంగా దాడి చేస్తూనే ఉంది. దాదాపు 12 నిమిషాల పాటు ఈ దాడి జరుగుతున్నా క్లాస్ రూమ్ లోని ఇతర విద్యార్థులు భయంతో డెస్కులపై తలలు దించుకుని అలాగే ఉండిపోయారు.
ALS Academy School : ఆసుపత్రి పాలైన విద్యార్థి – యాజమాన్యం చర్యలు
సాయంత్రం బాలుడు ఇంటికి రాగా.. అతని ముఖం వాచిపోయి, తీవ్ర గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బాలుడిని వెంటనే స్థానిక పీజీఐ ట్రామా సెంటర్‌కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గురువారం తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఈ దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. ఘటన తీవ్రతను గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్.. దాడికి పాల్పడిన సదరు క్లాస్ మానిటర్ (బాలిక)ను తక్షణమే పాఠశాల నుండి బహిష్కరిస్తూ (Expelled) ఉత్తర్వులు జారీ చేశారు.
Epaper: epaper.vaartha.com
పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య..కన్నీరు పెట్టిస్తున్న రంగారెడ్డి ఘటన!

